Dec 19,2022 23:47

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి పాడేరు: ఓటర్ల నమోదు, తొలగింపులు, చేర్పులు మార్పులకు సంబంధించి ఫారం 7,8,9 పెండింగ్‌ దరఖాస్తులు, జాబితాల పనులు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఎఇఆర్‌ఓ (తహసిల్దార్లు) లను, సబ్‌ కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి ఈ నెల 22వ తేదీ తుది గడువుగా నిర్దేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి తహసిల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ మాట్లాడుతూ, జనవరి 5న ఓటర్ల జాబితా తుది ప్రచురణ ఉన్నందున పెండింగ్‌ ధరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రతి క్లెయిమ్‌తో పాటు సంబంధిత 7,8,9 ఫారం తప్పనిసరిగా ఉండాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున ఓటర్ల జాబితాకు సబంధించిన పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. బిఎల్‌ఓలు సహకరించకుంటే నిభందనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ పాడేరు జిలాల్లో సందర్శించే అవకాసమున్నందున బిఎల్‌ఓలు, తహసిల్దార్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజినీరింగ్‌ సహాయకులు సహకరించలేదని దుంబ్రిగుడ తహసిల్దార్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా కలెక్టర్‌ స్పందిస్తూ, తహసిల్దార్లు సహాయ ఎన్నికల అధికారులైనందున వారికి సహకరించాల్సిందేనని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. పోలింగ్‌ కేంద్రం వారీగా నివేదికలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, ఆయా మండలాల నుండి తహసిల్దార్లు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి
పాడేరు : పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం గొందూరు సమీపంలో మెట్ట బంగళా వద్ద రోడ్డు పరిసరాలను డివిజినల్‌ అటవీ శాఖాధికారి వినోద్‌ కుమార్‌, పాడేరు ఎంపిడిఓ సాయి నవీన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి ఇరువైపులా చెత్తను తొలగింపు కార్యక్రమాన్ని కలెక్టర్‌ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ముందుగా పాడేరు నుండి గరికబంద, అరకు నుండి చిలకలగెడ్డ, పాడేరు నుండి జి.మాడుగుల మధ్య గల ప్రాంతాన్ని క్లీన్‌ డ్రైవ్‌ చేపట్టి పైలట్‌గా శుభ్రపరచాలని సూచించారు. ఈ ప్రాంతాలలో ముందుగా 15 రోజులు పరిశీలించి తదుపరి మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తంచే విధంగా కార్యాచరణ చేపట్టాలని డిఎఫ్‌ఓను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 47 మంది నిరుద్యోగ గిరిజనులను గుర్తించి వారికి ఉపాధి కల్పించాలని, ఒక్కొక్కరికి రోజుకు రూ.500 లు వేతనం చెల్లించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక డంపర్‌ బిన్ను ఏర్పాటు చేయాలన్నారు. పాడేరు పట్టణంలో ప్రతి దుకాణదారుడూ డస్ట్‌ బిన్నులు ఏర్పాటు చేసుకొనే విధంగా చైతన్య పరచాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వీలైనన్ని మొక్కలు పెంచాలని సూచించారు. అటవీ సిబ్బింది సహకారంతో రక్తదాన శిభిరం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్‌ఓ వినోద్‌ కుమార్‌, పాడేరు ఎంపిడిఓ సాయి నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.