Aug 04,2023 22:14

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ కల్పన కుమారి

ప్రజాశక్తి-సీతంపేట :  ఓటర్ల జాబితాలో తప్పిదాలు ఉండకూడదని, అత్యంత పారదర్శకంగా ఓటర్‌ సర్వే జరిగేలా చర్యలు తీసు కొంటున్నామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శుక్రవారం పాలకొండ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తప్పులు, మరణించిన వారి పేర్లు తొలగించడం, పోలింగ్‌ బూత్‌లను సరిచేయడం, వేరే రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లు తొలగించడం వంటివి చేసేటప్పుడు నిబంధనల ప్రకారం చేయాలన్నారు. ఓటరు సర్వేలో రాజకీయ పార్టీల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. కేవలం బిఎల్‌ఒలు, సంబంధిత సూపర్‌వైజర్లు మాత్రమే సర్వేలో పాల్గొనాలని స్పష్టంచేశారు. వాలంటీర్లు, ఎన్‌జిఒలు, ఇతర రాజకీయ పార్టీల వ్యక్తుల ప్రమేయం ఉండకూడదన్నారు. బిఎల్‌ఒలు సర్వే చేసేటప్పుడు ముందుగా నియమించిన రాజకీయ పార్టీల ఏజెంట్లు పాల్గొనవచ్చన్నారు. సర్వే షెడ్యూల్‌ను రాజకీయ పార్టీలకు అందజేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు చెప్పిన అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. కొత్త పంచాయతీలకు పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బోగస్‌ ఓట్లు తొలగిస్తామన్నారు. ఒకే ఇంటి నంబర్‌ మీద ఎక్కువ ఓట్లు ఉన్న అంశాన్ని పరిశీలించి వాటిని కూడా తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి.కళావతి, ఎపిఒ రోషిరెడ్డి, తహశీల్దారు నరసింహమూర్తి, డిటిలు, నాగేంద్ర కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.