* రాజకీయ పార్టీలకు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సూచన
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: ఓటర్ల జాబితాల్లో బూత్ స్థాయిలో సమస్యలుంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ రాజకీయ పార్టీలను కోరారు. కలెక్టరేట్ వివిధ రాజకీయ పార్టీలతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన సభ నియోజకవర్గాల వారీగా ఈ నెల 28 నాటికి జిల్లాల్లో 18,07,713 ఓటర్లు నమోదై ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి 28 వరకు చేర్పులు, తొలగింపులు చేపడుతున్నట్టు తెలిపారు. చేర్పులు (ఫారం-6) 5152, తొలగింపులకు (ఫారం-7) 2644, దిద్దుబాట్లకు (ఫారం-8) 3324 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లు దూరంగా ఉన్నా, పాడైనా, అలాంటి వాటికి మార్పులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తొలగింపుల ప్రక్రియకు సంబంధించి బిఎల్‌ఎలకు సహకరిం చాలని కోరారు. ఓట్ల తొలగింపులు, చేర్పులలో ఎలాంటి అపోహలకు తావు లేదని, ఎక్కడైనా ఓట్లు తొలగింపులు, చేర్పులలో, అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదు చేస్తే సంబంధిత వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల వారు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, మురళి కష్ణ, వైసిపి నుంచి రౌతు శంకరరావు, టిడిపి నుంచి పిఎంజెె.బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, బియస్పీ నుంచి ఎల్.సోమేశ్వరరావు, బిజెపి నుంచి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.










