
పుట్టపర్తి అర్బన్ : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా-2024 తయారీకి అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలియజేశారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి మంగళవారం నాడు ఎలక్టోరల్ రోల్స్ - స్పెషల్ సమ్మర్ రివిజన్ ఓటర్ల జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్‌తో పాటు ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌ఒ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధివిధానాల మేరకు జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టామన్నారు. పున:పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అనర్హుల ఓటర్లకు సంబంధించి 46,869 ఫిర్యాదులు రాగా, ఫిర్యాదులకు సంబంధించి పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు అందించిన ఫిర్యాదుల్లో డెత్ కేసులకు సంబంధించి 7985 పరిశీలన పూర్తి చేశామన్నారు. జిల్లాలో తొలగించిన ప్రతి ఓటునూ క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. ఫారం-6 ఇంకా జిల్లాలో 38 శాతంపెండింగ్‌లో ఉందన్నారు. ఫారం-7లో 72 శాతం పెండింగ్‌లో ఉందన్నారు. ఫారం-8లో 20 శాతం పెండింగ్‌లో ఉందని తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఈనెల 20వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీన తుది జాబితాను ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్‌ఒలు తిప్పేనాయక్, రాఘవేంద్ర, చిన్నయ్య, ఆయా మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.