
కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
ఓటర్ల జాబితా సవరణపై ఏ సందేహాన్నైనా అధికారులతో నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ పి.ప్రశాంతి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, రేషనలైజేషన్ ప్రక్రియ, తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే ఓటర్ల జాబితా సవరణ, తదితర అంశాలు చేపట్టినట్లు తెలిపారు. దీనిలో ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావు లేదన్నారు. ఏ విషయాన్ని అయినా అధికారులతో మాట్లాడి సందేహ నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే కచ్చితంగా తెలియజేయాలని సూచిం చారు. పోలింగ్ స్టేషన్ మార్పు అనేది కేవలం ఆ పోలింగ్ స్టేషన్ శిథిలావ స్థకు చేరుకుంటేనే చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి ప్రతినిధి బిహెచ్.శ్రీనివాస్‌వర్మ, ఐఎన్‌సి ప్రతినిధి టి.వంశీరెడ్డి, బిఎస్‌పి కాటూరి కరుణాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్, వైసిపి నాయకులు కామన నాగేశ్వరరావు, టిడిపి నాయకులు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎం.శ్యాంబాబు, కలెక్టరేట్ ఎఒ అప్పారావు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ ఎల్.నరసింహరావు, ఎలక్షన్ సెక్షన్స్ సిబ్బంది పాల్గొన్నారు.