కమిషనర్ షేక్ షాహిద్
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్‌లలో ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు క్షేత్రస్థాయిలో బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారు లను కమిషనర్ షాహిద్ ఆదేశించారు. ఓటర్ల జాబితా నవీకరణపై బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ షాహిద్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు నమోదు పత్రాలు అందించి ఓటర్‌గా నమోదయ్యేలా బిఎల్‌ఒలు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి వివరాలు ఉన్నాయో లేదో సరిచూ సుకొని తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. జాబితాలో క్లెయిమ్స్, అభ్యంతరాల కింద ఫారం 6, 7 ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసి పంపిణీ అవ్వని ఫొటో ఓటు గుర్తింపు కార్డులను వెంటనే పంపిణీ చేసేలా బిఎల్‌ఒలు చర్యలు తీసుకోవాలని కమిషనర్ షాహిద్ సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.










