Jul 25,2023 22:29

సమావేశంలో మాట్లాడుతున్న కూన రవికుమార్‌

*ప్రభుత్వానికి అనుకూలంగా కలెక్టర్‌
*ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
*టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి :
జిల్లాలో ఓటర్ల జాబితా పరిశీలనలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. శ్రీకాకుళం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఇంత నిర్లక్ష్యమేమిటని ప్రశ్నించారు. సిఎం జగన్‌ ఆదేశాల మేరకు ఐప్యాక్‌కు సమాచారం అందించేలా జిల్లా కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనా సరళిని విస్మరించి కలెక్టర్‌ వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనన్నారు. కలెక్టర్‌ ఇదే నిర్లక్ష్యంతో, పక్షపాత ధోరణితో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభించని తహశీల్దార్లు, విఆర్‌ఒలు, బిఎల్‌ఒలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తూతూమంత్రంగా అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో నెలనెలా కంటితుడుపు సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప వాటి ఫలితాలు మాత్రం రావడం లేదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐప్యాక్‌, ఇతర వ్యవస్థల ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ 10 నుంచి 20 వేల బోగస్‌ ఓటర్లను నమోదు చేసి వైసిపి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఐదు నుంచి 30 వరకు బోగస్‌ ఓట్లను నమోదు చేయించిందన్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓట్ల నమోదులో లోపాలను గుర్తించి, క్షేత్రస్థాయిలో బిఎల్‌ఒల ద్వారా ఇంటింటికీ వెళ్లి జాబితాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈనెల 21 నాటికే ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు 70 నుంచి 80 శాతం జిల్లాలో ప్రారంభం కాలేదన్నారు. ఇది జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లు ప్రజల, మహిళల వ్యక్తిగత సమాచారాన్ని చోరీకి పాల్పడి ఐప్యాక్‌ టీమ్‌కు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, నాయకులు సింతు సుధాకర్‌, ప్రధాన విజయరాం, బొనిగి భాస్కరరావు, కె.వెంకటరమణరాజు తదితరులు పాల్గొన్నారు.