Nov 03,2023 21:05

సమావేశంలో మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 4, 5వ తేదీలలో ఓటర్ల జాబితా పరిశీలనకు ప్రతి పోలింగ్‌ స్టేషన్లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీ ప్రతి నిధులతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ గిరీష ఆదేశాల మేరకు రెండు రోజులపాటు ప్రతి పోలింగ్‌ స్టేషన్లో ఓటర్‌ జాబితాతో బిఎల్‌ఒలు ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీల తరఫున బిఎల్‌ఎలను ప్రతి పోలీస్‌ స్టేషన్లో ఉంచాలని కోరారు. బిఎల్‌ఎ, బిఎల్‌ఒలు సమన్వయం చేసుకొని పోలింగ్‌ స్టేషన్కు తమ ఓట్లను పరిశీలించుకోవడానికి వచ్చిన ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్‌ జాబితా రూపకల్పనకు ఈ ప్రత్యేక శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిందిగా రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవంబర్‌ 7, 8వ తేదీలలో ఈవిఎంలకు మొదటి దశ పరిశీలనలో భాగంగా మాక్‌ పోలింగ్‌ జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధుల సందేహాలకు జాయింట్‌ కలెక్టరు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో అన్ని నియోజకవర్గాల ఎలక్ట్రోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, వైసిపి, టిడిపి, జనసేన, సిపిఐ, బిఎస్‌పి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.