Aug 13,2023 00:24

బిఎల్‌ఒలు చేసిన వర్కును పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి

ప్రజాశక్తి- అనకాపల్లి
ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు, తేడాలు లేకుండా పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి ఈఆర్‌ఓలు, బిఎల్‌ఓలను ఆదేశించారు. అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో శనివారం పర్యటించి బూత్‌ లెవెల్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఓట్లు చేర్చడం, తొలగించడం, మార్పు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు తప్పక ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేయాలన్నారు. ఎటువంటి ఒత్తిడికిలోను కాకుండా నియమాల ప్రకారం పని చేయాలని సూచించారు. అనకాపల్లి మండలం నర్సింగబిల్లి సచివాలయం, ఎలమంచిలి పట్టణంలోని నెహ్రు నగర్‌ సచివాలయం, బుచ్చయ్యపేట ఎంపీడీవో కార్యాలయాల్లో ఈఆర్వోలతో ఆయన సమావేశమై ఓటర్ల నమోదు ప్రక్రియ ఏ విధంగా చేస్తున్నది తనిఖీ చేశారు. బిఎల్‌ఓలను ప్రశ్నలు అడిగి వారికి గల అవగాహన, వారు ఏ విధంగా పనిచేస్తున్నారనేది తెలుసుకున్నారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఆయా నియోజకవర్గాల ఈఆర్‌ఓలు ఆర్డిఓ ఏ.చిన్నికృష్ణ, ఎన్‌ఏఓబి ఎస్డిసి కే.జ్ఞానవేణి, ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ అధికారి ప్రమీల గాంధీ పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 మందికి పైగా బిఎల్‌వోలు హాజరయ్యారు.