
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి క్షేత్రస్థాయిలో మార్పులు, చేర్పులపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ తెలిపారు. గురువారం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి పెండింగ్ ఉన్న దరఖాస్తుల స్థితి, ఈపి రేషియో, ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణలు రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎపిక్ కార్డుల జనరేషన్, పంపిణీ, పిఎస్‌ఈలు, డీఎస్‌ఈలు తదితర అంశాలపై సమీక్షించి కలెక్టర్‌లకు తగు దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా సచివాలయం నుండి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో పారదర్శక ఓటర్ల జాబితా నిమిత్తం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. 18,19 సంవత్సరాల యువఓటర్ల నమోదుపై ప్రత్యేకదష్టి సారించామని తెలిపారు. ఫారం 6,7,8లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు పూర్తిచేసి పెండెన్సీ కనిష్ట స్థాయిలోకి తీసుకురావడం జరుగుతుందని, కొత్తగా ఓటుహక్కు నిమిత్తం నమోదు చేసుకున్న దరఖాస్తులతో పాటు మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించి జెండర్ రేషియో సమతుల్యం చేయడం జరుగుతుందని, ఒకే డోర్ నెంబర్‌తో ఎక్కువ మంది ఓటు హక్కు కలిగి ఉన్న, డోర్ నెంబర్ లేకుండా ఓటు హక్కును కలిగి ఉన్న ఓటర్ల వివరాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తమ పరిశీలనను దాదాపు పూర్తిచేయడం జరిగిందని, త్వరలో ఆన్లైన్ చేయడం జరుగుతుందని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి నుండి అందిన వినతులను వంద శాతం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎన్నికల కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ఎలెక్షన్ సెల్ సూపరింటెండెంట్ బ్యూలా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.