Sep 08,2023 21:41

రాజకీయ పార్టీల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలో ఓటర్‌ జాబితాకు సంబంధించి అందిన క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌ పక్కాగా పరిశీలన చేస్తున్నామని, తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు కషి చేస్తున్నామని కలెక్టర్‌ గిరీష తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన దాదాపు పూర్తయిందన్నారు. సదరు పరిశీలన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజ కవర్గంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించామన్నారు. డెత్‌, షిఫ్టెడ్‌, రిపీటెడ్‌ ఓట్లను ఒకటికి రెండుసార్లు మరలా పరిశీలించడం జరిగిందన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఫామ్‌ 9లో 1403, ఫామ్‌ 10లో 3092, ఫామ్‌ 11లో 858, ఫామ్‌ 11ఎ లో 234, ఫామ్‌ 11బిలో 36 క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌ దరఖాస్తులు అందాయని వాటిని అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించామని తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు గతంలో డిలీటైన ఓట్లను బిఎల్‌ఒలు పోలింగ్‌ స్టేషన్‌ వారీగా పరిశీలించారన్నారు. 2022 జనవరి 6వ తేది ప్రత్యేక ఓటర్‌ జాబితా సంక్షిప్త సవరణ నుంచి నేటి వరకు 21 వేలు డెత్‌, 7 వేలు షిఫ్ట్‌, 3 వేలు రిపీటెడ్‌ అయి తొలగించిన ఓట్లను పోలింగ్‌ స్టేషన్‌ వారీగా ఆయా బిఎల్‌ఒలు పరిశీలించామని పేర్కొన్నారు. సాంకేతికపరంగా కొన్ని ఓట్లు డిలీటై ఉంటాయని ఇందులో ఇంకనూ రాజకీయ పార్టీలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెప్పారు. జంక్‌ ఓటర్లను పరిశీలిస్తున్నామని ఇంకా ఎక్కడైనా ఓకే డోర్‌ నెంబర్లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తమ దష్టికి తీసుకురావాలని చెప్పారు. పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్స్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. ఒక వారంలోపు పోలింగ్‌ స్టేషన్స్‌ రేషనల్లైజేషన్స్‌పై తనకు నివేదిక సమర్పించాలని నియోజకవర్గ ఈఆర్వోలను ఆదేశించారు. రాజకీయ పార్టీల నుంచి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా డోర్‌ నెంబర్‌ నాట్‌ అవైలబుల్‌ అని జాబితాలు ఇచ్చారని ఇందుకు సంబంధించి మున్సిపల్‌ డోర్‌ నెంబరు, ఓటర్‌ జాబితాకు సంబంధించి డోర్‌ నెంబరు వేరుగా ఉంటాయని వీటిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఓటర్‌ జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి ఓటరు దరఖాస్తు చేసుకున్న పిదప ఆ మార్పు జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రతి తాసిల్దార్‌ కార్యాలయంలో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ అక్టోబర్‌ 17 నాటికి డ్రాఫ్ట్‌ రోల్‌ పబ్లిష్‌ చేస్తామని అప్పుడు ప్రతి తహశీల్దార్‌ కార్యాలయంలో ఎలెక్టోరల్‌ జాబితాను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్‌ చర్చించి పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, రామకృష్ణారెడ్డి, మురళి, ఆయా నియోజకవర్గాల ఇఆర్‌ఒలు, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.