ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: ఓట్లు తొలగింపు, నూతన ఓట్లు చేర్పులపై టిడిపి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం మార్టూరు మండలం జొన్నతాళిలోని గొట్టిపాటి క్యాంపు కార్యాలయంలో చెన్నుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో గొట్టిపాటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ అవినీతి, అక్రమ దాడులు, అఘాయిత్యాలే తప్ప ఉపాధి, అభివృద్ధి ఊసేలేని వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారని, బూత్ ఇన్‌చార్జ్‌లు వారి పరిధిలోని టిడిపి సానుభూతిపరుల ఓట్లు ఉన్నాయో లేదో చూడాలన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కే ఇజ్రాయిల్, సీనియర్ నాయకుడు మళ్లీనీడి గోవిందరావు, గొట్టిపాటి శంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










