
ప్రజాశక్తి -నక్కపల్లి:ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇంటింటా జరుగుతున్న ఓటర్ సర్వేను శనివారం అధికారులు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు పరిశీలించారు. ఈ మేరకు ఈఆర్‌ఓ రామలక్ష్మి, తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీడీవో శ్రీనివాసరావు, డీటీ నీరజ, రెవిన్యూ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఓటర్ సర్వే తీరును క్షుణంగా పరిశీలించారు. ఈనెల 21 తేదీతో సర్వే ముగుస్తుండటంతో మరింత వేగంగా సర్వే చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటివి నిష్పక్షపాతంగా చేపట్టాలని ఆదేశించారు.స్పష్టమైన పూర్తి ఆధారాలు ఉంటే తప్ప ఓటర్లను తొలగించకూడదన్నారు.
కోటవురట్ల:ఓటర్ జాబితా దృవీకరణ, తొలగింపు విషయంలో నిబంధనలు పాటించాలని పోలింగ్ స్టేషన్ల సూపర్వైజర్ ఊర్ధవరావు సూచించారు. మండలంలో కైలాస పట్నం, తంగేడు, లింగాపురం, కోటవురట్ల తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఓటర్ సర్వేను పరిశీలించారు. ప్రధానంగా ఓట్ల తొలగింపు విషయంలో నిబంధనలు పాటించాలని, ఇష్టానుసారంగా ఓట్లు తొలగిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉందని బిఎల్‌ఓలకు సూచించారు. నమోదు, తొలగింపులు, సవరణలు వంటి వాటిపై రికార్డులు తప్పనిసరిగా పొందుపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.