ఓటమితో పాఠాలు నేర్చుకోవాలి - మామూలు పోలీస్ కానిస్టేబుల్ కథే లాఠీ సినిమా - ఎస్వీిసీఈ కళాశాలలో సందడి చేసిన సినీ హీరో విశాల్
ఓటమితో పాఠాలు నేర్చుకోవాలి
- మామూలు పోలీస్ కానిస్టేబుల్ కథే లాఠీ సినిమా
- ఎస్వీిసీఈ కళాశాలలో సందడి చేసిన సినీ హీరో విశాల్
ప్రజాశక్తి-తిరుపతి మంగళం: జీవితంలో ప్రతి రంగంలో ఏదో ఒక సందర్భంలో ఓటమి అనేది పలకరిస్తుందని, ఓటమి చెందాం అనుకోకుండా ఆ ఓటమి నేర్పే పాఠాలను స్ఫూర్తిగా చేసుకుని విజయం కోసం ప్రయత్నాలు చేయాలని సినీ హీరో విశాల్ విద్యార్థులకు సూచించారు. రాణా ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకులు వినోద్ కుమార్ దర్శకత్వంలో, రమణ, నందా నిర్మాతలుగా నాలుగు భాషల్లో తెరకెక్కిన 'లాఠీ' చిత్రం ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయనుంది. ఈ క్రమంలో సోమవారం తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ' లాఠీ' చిత్రం ఫ్రీ రిలీజ్ కోసం చిత్ర కథానాయకుడు విశాల్ హాజరై మాట్లాడారు. ప్రేక్షకులుగా మీరు టికెట్టు కొన్న డబ్బుతో ఓ చిత్ర కథానాయకుడిగా నేను, నా కుటుంబం మూడు పూటలా భోజనం చేస్తున్నా మని, మీరిచ్చిన సొమ్ముతో ఉన్నత చదువులు చదువుకోలేని నిరుపేద విద్యా ర్థులకు చేయూతనివ్వడానికి నాకు అందుతున్న ధనంలో ఒక్క రూపాయి, కళాశాలలో ఉన్న విద్యార్థులు కూడా ఒక్కొక్కరు ఒక్క రూపాయి అందివ్వాలని ఇద్దరు పేద విద్యార్థులకు ఈ విద్యా సంవ త్సరం ఫీజును చెల్లించడానికి అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. లాఠీ సినిమాలో ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ జీవితం, అతని కుటుంబం ఒక్కసారిగా ఎదురైన సంఘటనతో ఆ కానిస్టేబుల్ ఎదుర్కొన్న సంఘటనలపై చిత్రం తెరకెక్కిందన్నారు. సమాజాన్ని అభివద్ధి చేయడానికి విద్యార్థులుగా మీరు విద్యను పూర్తి చేసుకొని బయటకు రావాలని ఆశిస్తున్నామన్నారు. సినీ నటులు పవన్ కళ్యాణ్ సినిమాలను ఓ ప్రేక్షకుడిగా థియేటర్లలో కూర్చుని చూశానని, భవిష్యత్తులో అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తానన్నారు. తదుపరిచిత్రం మార్క్ ఆంటోనీలో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నానని, డిటెక్టీవ్ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. నడిగర సంఘం భవనం ఐకానిక్గా తీర్చిదిద్ది ఆ భవనం ద్వారా వచ్చిన డబ్బులతో వీధుల్లో నటిస్తున్న వారికి పెన్షన్ గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. నా ప్రమేయం లేకుండానే నేను కుప్పం నుంచి పోటీ చేస్తున్నట్టు రాజకీయంగా విమర్శలు కూడా సష్టించారని.. విద్యార్థి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి బందోబస్తుగా వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లతో సరదాగా ఫోటోలకు ఫోజు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో విశాల్ సమాధానాలు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సినీ హీరో విశాల్ తో సెల్ఫీలు దిగడానికి కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి, మోహన్ బాబు కళాశాల విద్యార్థులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.










