Oct 11,2023 23:23

బహుమతులు పొందిన జట్లతో కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తదితరులు

ప్రజాశక్తి - వినుకొండ : ఒక ఓటమి గొప్ప విజయానికి నాంది పలుకుతుందని, గెలుపోటములు ముఖ్యం కాదని, క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్థానిక సాయిరాం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులను స్థానిక జాషువా కళా ప్రాంగణంలో బుధవారం ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లా డుతూ కబడ్డీ వల్ల టీం స్పిరిట్‌, లైఫ్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పారు. క్రీడల వల్ల దేహదారుఢ్యంతోపాటు ఆత్మవిశ్వాసం, మానసిక వికాసం అభివృద్ధి చెందుతాయన్నారు. కష్టం విలువను, దాని వల్ల వచ్చే ఫలితాలను విద్యార్థులకు అర్థం చేయించగలిగితే ఇష్టంగా చదువుతారని, ఆ దిశగా ఉపాధ్యాయులు ప్రేరణ కల్పించాలని సూచించారు. ఇదిలా ఉండగా మొదటి బహుమతిని గీతాంజలి పాఠశాల బి.నందకిషోర్‌ జట్టు, రెండో బహుమతిని భాష్యం పాఠశాల కె.పవన్‌ కుమార్‌ జట్టు, మూడవ బహుమతి ఆంధ్రప్రదేశ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాల వినుకొండ బి.భరత్‌ నాయక్‌ జట్టు గెలుచుకున్నాయి. ఆయా జట్లకు వరుగా రూ.10116... రూ.7116... రూ.5116 నగదు బహుమతులతోపాటు కప్పులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ వెంకయ్య, తహశీల్దార్‌ కిరణ్‌, ఎంఇఒ సయ్యద్‌ జాఫ్రుల్లా, కౌన్సిలర్లు షకీలా, కె.బ్రహ్మయ్య, సాయిరాం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ డైరెక్టర్‌ ఎం.చంద్ర, బెజవాడ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా కాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారిని సత్కరించారు.