ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఓటర్ల జాబితా నుంచి మృతుల పేర్ల తొలగింపు సమయంలో విచారణ జరపాకే తొలగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. అమర్తలూరు మండలం గోవాడ గ్రామం, కర్లపాలెం మండలంలోని బుద్దాం గ్రామాలలో జిల్లా కలెక్టరు గురువారం విస్తతంగా పర్యటించారు. మృతులు, శాశ్వత వలస, ఇతర కారణాలతో ఓటర్లను తొలగించే సమయంలో అధికారులు తప్పనిసరిగా పున్ణపరిశీలన చేయాలని కలెక్టరు ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మృతిచెందిన వారు, శాశ్వత వలసలు వెళ్లినవారు, ఒకే పేరు రెండు ప్రాంతాల్లో ప్రచురితమైన వారి గృహాలకు వెళ్లి ఆయన స్వయంగా విచారించారు. ఆ గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి 11 గృహాలకు వెళ్లారు. సంబంధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. మృతిచెందిన వారి మరణ ధృవీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించారు. శాశ్వతంగా వలస వెళ్లినవారు ఆ గ్రామాలను ఎప్పుడు విడిచి వెళ్లారు, ఎంత కాలం నుంచి ఇక్కడ నివాసం ఉండటం లేదో క్షేత్రస్థాయిలో కుటుంబ సభ్యులను, గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
బుద్దాం గ్రామంలోని కోడ్ నెం-93 అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేవలం ఐదుగురు చిన్నారులు ఉండడం, అంగన్‌వాడీ కార్యకర్త లేకపోవడంపై కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతిరోజూ కోడిగుడ్లు, భోజనం తప్పనసరిగా ఇవ్వాలని ఆదేశించారు. రెండు కేంద్రాలను మిళితం చేసినప్పటికీ ఐదుగురు పిల్లలే ఉండడం ఏమిటని అంగన్‌వాడీ ఆయాను ప్రశ్నించారు. తక్షణమే విచారించి నివేదిక పంపాలని ఆర్‌డిఓను ఆదేశించారు.
ఆయన వెంట గుంటూరు జెడ్‌పి సిఇఓ జి మోహన్‌రావు, బాపట్ల ఆర్‌డిఓ జి రవీందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణకాంత్, తహశీల్దార్ కేశవనారాయణ తదితరులు ఉన్నారు.










