Aug 26,2023 23:18

ప్రజాశక్తి - వేటపాలెం
ఓట్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులను తిరిగి విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా స్థానిక అధికారులను ఆదేశించారు. చిన్నగంజాం మండలంలో ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలను తహశీల్దారు కార్యాలయంలో ఆయన శనివారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మారకదర్శకాలను అనుసరించి బిఎల్ఓలు విధులు నిర్వహించాలని చెప్పారు. చిన్నగంజాం మండలంలోని  262, 269, 273, 274, 279, 282, 294  పోలింగ్  కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను ఆయన స్వయంగా విచారించారు. తొలగింపుల కోసం చట్టబద్ధంగా దరఖాస్తుదారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. బిఎల్ఓల పనితీరుపై ఎన్నికల అధికారుల పర్యవేక్షణ పెరగాలన్నారు. ఫారం-7 దరఖాస్తుల విచారణ ప్రక్రియపై క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అత్యంత పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో చీరాల ఇంచార్జి ఆర్‌డిఓ జి రవీందర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాల్గొన్నారు.