Aug 26,2023 23:21

ప్రజాశక్తి - అద్దంకి
ఓట్ల తొలగింపు ప్రక్రియ ఫారం 7పై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి  విచారణ చేపట్టే సమయంలో దరఖాస్తును ఒకటికి రెండు సార్లు పరిశీలించి విచారణ న్యాయం బద్దంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ పి రంజిత్ బాషా స్తానిక అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో బిఎల్ఓలతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరిశీలించాలని సూచించారు. అనంతరం ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలను అనుసరించి బిఎల్ఓలు విధులు నిర్వహించాలని చెప్పారు. పట్టణ, మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను స్వయంగా విచారణ చేయాలని, తొలగింపుల కోసం చట్టబద్ధంగా దరఖాస్తు దారులకు నోటీసులు ఇవ్వాలని అన్నారు. బిఎల్ఓల పనితీరుపై ఎన్నికల అధికారుల పర్యవేక్షణ పెరగాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో సమస్యలు ఉత్పన్నంకా కుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ జివి సుబ్బారెడ్డి, ఎంపిడిఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బిఎల్ఓలు పాల్గొన్నారు.