Jul 17,2023 00:12

ఓటరు దరఖాస్తు స్వీకరణలో యంత్రాగం (ఫైల్‌)

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలపై నిశిత పరిశీలన చేయనున్నారు. గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ స్థానాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 21 వతేదీనుంచి ప్రారంభం కాబోతున్న 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ'పై ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే టిడిపి,వైసిపి, జనసేన, వామపక్షాలు, బిజెపి కూడా నిశితపరిశీలన చేస్తున్నాయి. ఓటర్ల వివరాలతోపాటు అవకాశం ఉన్న చోట్ల వారి ఫోన్‌ నంబర్లు కూడా ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు సేకరిస్తున్నట్టు తెలిసింది.
ఓటర్ల జాబితాల సవరణ నేపథ్యంలో ఈ అంశంపై సోమవారం గుంటూరులో మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో వైసిపి ప్రాంతీయ కార్యాలయంలో ఆపార్టీ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. పార్టీ యంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరించేలా ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు బాధ్యతతో పని చేయాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించింది. దొంగఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో కీలకంగా వ్యవహరించాలని వైసిపి పార్టీ శ్రేణులను కోరింది. పార్టీ బూత్‌ కమిటీల ఇన్‌ ఛార్జులు, గృహసారధులతో జాబితాల పరిశీలన చేయనున్నారు.
మరోవైపు టిడిపి ఇప్పటికే ఓటర్ల జాబితాలపైమొదటి విడత కసరత్తు పూర్తి చేసింది. పార్టీ కార్యకర్తలతో కలిసి క్లస్టరు ఇన్‌ఛార్జిలు, గ్రామ,వార్డు స్థాయి నాయకులు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బోగస్‌ ఓటర్లను గుర్తించారు. గుంటూరు నల్లచెరువు ప్రాంతంలో ఒకే డోర్‌ నంబరుపై 200పైగా ఓటర్లు ఉన్నారని టిడిపి ఫిర్యాదు చేయగా అధికారులు పరిశీలన చేసి 2019 ముందు నుంచి ఒకే డోర్‌ నెంబరుపై వీరంతా ఉన్నారని వీరు బోగస్‌ ఓటర్లు కాదని నగర అదనపు కమిషనర్‌ పెద్దిరోజా ప్రకటించారు. అయినా వీరంతా బోగస్‌ ఓటర్లనేని టిడిపి కార్పొరేటర్లు వాదిస్తున్నారు. ఇలాంటి బోగస్‌ ఓటర్ల వల్లే తాను ఓడిపోయాయని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం వాపోయారు. అయినా వీరిని తొలగించడానికి మాత్రం అధికారులు సుముఖత చూపలేదు.
ఇప్పటికే టిడిపి గ్రామ స్థాయి నాయకులు బోగస్‌ ఓటర్లను, స్థానికంగా నివశించని వారిని, చనిపోయిన వారిని తొలగించాలని అధికారులకు పోలింగ్‌ బూత్‌ స్థాయిలోనే వినతి పత్రాలు అందచేసింది. దీంతో అధికారపక్షం అప్రమత్తం అయింది. వాలంటీర్లను ఉపయోగించి తమ పార్టీ ఓటర్ల తొలగిస్తున్నారని, చనిపోయిన ఓటర్లను కొనసాగిస్తున్నారని టిడిపి ఆరోపించింది. దీంతో ఈసారి వాలంటీర్ల స్థానంలో వైసిపి నియమించిన గృహ సారధులను క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించేందుకు బాధ్యతలు అప్పగించారు. జనసేన కూడా తమకు పట్టు ఉన్న నియోజకవర్గాలో ఓటర్లజాబితాలపై దృష్టి సారించింది. ప్రధానంగా తెనాలి, గుంటూరు తూర్పు, పశ్చిమ, సత్తెనపల్లి, నర్సరావుపేట, గురజాల తదితర నియోజకవర్గాలపై ఆపార్టీ దృష్టి సారించింది. అంతేగాక జనసేన, టిడిపి పొత్తు ఉండే అవకాశం ఉండటంతో తమ పార్టీ ఓటర్లను అధికారపార్టీ తొలగించే అవకాశం ఉండటంతో అన్ని నియోజకవర్గాల్లో తమ ఓటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని ఆపార్టీ జిల్లా నాయకులు తెలిపారు.