Jul 05,2023 00:15

సమస్యలను చెపుతున్న గ్రామస్తులు

ప్రజాశక్తి -కోటవురట్ల:జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం (ఓటిఎస్‌) కింద రూ.10వేలు చెల్లించినా నేటికీ గృహ హక్కు పత్రాలు అందజేయలేదని మండల కేంద్రంలో మంగళవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావును గ్రామస్తులు నిలదీశారు. 10వేలు చెల్లించి నాలుగు సంవత్సరాలు పూర్తికా వస్తున్న నేటికీ హక్కు పత్రాలు అందజేయలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయగా స్థానిక నాయకులు కల్పించుకొని అమరావతి వెళ్లి చేయిస్తామని వ్యంగ్యంగా మాట్లాడడంతో డబ్బులు ఇక్కడ చెల్లిస్తే అక్కడ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ సచివాలయ అధికారులకు వెంటనే వాళ్లకి హక్కు పత్రాలు అందజేయాలని సూచించారు.మంజూరు చేసిన కాలనీ ఇల్లు సైతం కొందరు నాయకులు చేతులు మారుస్తూ అమ్మకాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలలో తాగునీరు, పారిశుద్ధ్య పట్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, డిప్యూటీ తహసిల్దార్‌ సోమశేఖర్‌, స్థానిక సర్పంచ్‌ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.