ప్రజాశక్తి-సత్తెనపల్లి : త్రిపురలో బిజెపికి ఓటు వేయలేదని ప్రజలపై బిజెపి గుండాలు చేస్తున్న దాడులను ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలని సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో జరిగిన త్రిపుర బాధితుల సంఘీభావ నిధి వసూళ్ల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలమయ్య మాట్లాడుతూ బీజేపీ త్రిపురలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సిపిఎం కార్యకర్తలపై దాడులు, సిపిఎం కార్యాలయాలు తగలబెట్టడం, బిజెపికి ఓటు వేయలేదని అక్కడ బిజెపి గుండాలు ప్రజలపై గమనకాండకు దిగడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా బిజెపి యేతర పాలనలో ఉన్న రాష్ట్రాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. దేశ సంపదను మొత్తాన్ని అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు దూచిపెడుతూ ఎన్నికల సమయంలో వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో నిధులను రాబట్టుకొని ప్రత్యర్థులపై, ప్రజలపై ఈ విధమైన దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ విధమైన దాడులకు పాల్పడుతున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు కె.శివదు ర్గారావు, ఎ.వీరబ్రహ్మం, ఎ.ప్రసాదరావు, జె.రాజకుమార్, షేక్ సైదులు, ఆర్.పురుషోత్తం, మస్తాన్‌వలి, జి.బాలకృష్ణ, జి.ఉమశ్రీ, ఎం.హరి పోతురాజు, వై.వెంకటరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని మాదలలో విరాళాల సేకరణ చేపట్టగా సిపిఎం మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడారు. సిపిఎం, ప్రజా సంఘాలపై బిజెపి మూకలు దాడులకు తెగబడుతున్నాయని చెప్పారు. కార్యాలయాలు, కార్యకర్తల నివాసాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. ఈ దాడులను ఖండించడంతోపాటు బాధితులకు బాసటగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జి.జాలయ్య, పి.సైదాఖాన్, కె.నాగేశ్వరరావు, ఎం.వెంకటరెడ్డి, టి.బ్రహ్మయ్య, జి.నాగేశ్వర రావు, చిన్నారావు, జి.రామారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : ఆల్ ఇండియా కిసాన్ సభ పిలుపు మేరకు ఎంటిఎంసి పరిధిలోని కొలనుకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సహాయ నిధి సేకరణ చేపట్టారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, కె.ధనలక్ష్మి, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు డి.వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు కె.శివన్నారాయణ, ఎస్.మోహన్‌రావు, బి.నాగేశ్వరరావు, సురేష్, రమేష్ పాల్గొన్నారు.










