ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మోసం చేయకుండా ఎదగడాన్ని అలవాటు చేసుకోవాలని సినీ రచయిత, నటుడు, ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి మండలి అధ్యకులు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీల సంయుక్తంగా సోమవారం నిర్వహించిన కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమకు నచ్చిన రంగాలను ఎంచుకోవాలని, మరొకరిని తొక్కుకుంటూ కాకుండా స్వశక్తితో ఎదగాలని చెప్పారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా ఆనాటి విద్యార్థి రాజకీయాలను, తరగతి పాఠాలను, కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. కుల, మత, ప్రాంతీయ అభిమానం ఉండటం సహజమే అయినా వాటి ఆధారంగా అసమర్ధులకు, వెన్ను పోటుదారులకు మద్దతివ్వొద్దని వ్యాఖ్యానించారు. తల్లితండ్రులు తమ బిడ్డకు పెళ్లి చేసేటప్పుడు ఎన్ని విధాలుగా ముందు వెనుక ఆలోచిస్తారో అదేరీతిగా ఓటు వేసేటప్పుడు ఆలోచించాలని, కులపిచ్చితో వేయొద్దని సూచించారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ చిన్నచిన్న ఉద్యోగాలతో సంతృప్తి చెందకుండా ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడు విశ్వద్యాలయానికి గర్వకారణంగా ఉంటుందన్నారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ, వివిధ రాష్ట్రాల్లోని సెంట్రల్ యూనివర్సిటీలు మీకోసం ఎదరు చూస్తున్నాయని, వాటిలో పరిశోధనల ద్వారా ఉన్నత స్థానాల్లోకి వెళ్లొచ్చని చెప్పారు. రానున్న విద్యా సంవత్సరంలో అనేక కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. పోటీ పరీక్షలకు సమాయత్తం అవుతున్న విద్యార్థుల కోసం రీడింగ్ రూంలో ఏసీ సమకూస్తు న్నామని, మహిళా వసతి గృహ ప్రాంగణంలో మరో రీడింగ్ రూంను రాబోయే 6 నెలల్లో నిర్మిస్తామని, బాలి కల కోసం మరో కొత్త వసతి భవనాన్ని నిర్మిస్తున్నామని ప్రకటించారు. అనంతరం వర్సిటీలో నిర్వహించిన పలు క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెక్టార్ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, ప్రిన్సిపాల్ స్వరూపరాణి, కె.గంగాధర్‌రావు పాల్గొన్నారు.










