Oct 19,2023 22:07

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల తలరాతలను మార్చేందుకు యుటిఎఫ్‌ నాయకత్వం నడుం బిగించింది. నేడు.. రేపు అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయులను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తూ జిపిఎస్‌ (గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌)ను తీసుకొచ్చిన ప్రభుత్వ దుర్మార్గంపై తుదిపోరుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తున్న ప్రభుత్వం తీరు మార్చుకొని న్యాయం చేయాంలంటూ విజయవాడలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకత్వం నిరాహార దీక్షలకు పూనుకుంటే గురువారం జిల్లా కేంద్రంలో యుటిఎఫ్‌ జిల్లా శాఖ నేతృత్వంలో ఐఖ్య ఉపాధ్యాయ పెడరేషన్‌ నాయకులు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలను చేపట్టారు. అలాగే 20వ తేదీ శుక్రవారం జిల్లాలోని ఆర్‌డిఒ కేంద్రాల్లో యుటిఎఫ్‌ నాయకత్వం నిరాహార దీక్షలకు పూనుకోనుంది. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై తాడోపేడు తేచ్చుకొనేందుకు యుటిఎఫ్‌ ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకోవాల్సి వస్తోంది. పాతపెన్షన్‌ విధానం అమలు చేస్తానంటూ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన జగన్‌ మోహన్‌రెడ్డి తీరా అధికారంలోకి వచ్చికా ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆది నుండీ పాత ఓపిఎస్‌ కోసం సుదీర్ఘ పోరాటాన్ని నడిపిన యుటిఎఫ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రస్థాయి నుండీ మండలస్థాయి దీక్షలకు పూనుకుంది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా మారిన సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ విధానాన్ని తీసుకురావాలని యుటిఎఫ్‌ కోరుతోంది. ప్రభుత్వ మోసపూరితంగా జీపిఎస్‌ను వల్ల ప్రయోజం లేకపోగా అనర్థాలే అధికం. ప్రభుత్వం పొంతన లేని సమధానాలకు యుటిఎఫ్‌ ఓపిఎస్‌ అమలు చేయడం వల్ల ప్రభుత్వం ఎలాంటి
భారం ఉండబోదని స్పష్టంగా తెలియజేసింది. సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలను అంగీకరించమని పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాల్సిందేనని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతి రెడ్డి, చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏం.సోమశేఖర్‌ నాయుడు, జివి.రమణ డిమాండ్‌ చేశారు.
యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు గురువారం చిత్తూరులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పాతపెన్షన్‌ సాధనకై నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈకార్యక్రమాన్ని యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు పాండియన్‌ దీక్షలో కూర్చున్న వారందరికీ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాత పెన్షన్‌ అమలు చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ అమలు చేస్తే వంద సంవత్సరాల వరకు ఆర్థిక భారమని చెప్పడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. పాదయాత్ర హామీని అమలు చేయకుండా దేశానికి అంతటికి ఆదర్శమని చెబుతున్న జిపిఎస్‌ విధానం సిపిఎస్‌కు మరొక రూపం తప్ప ప్రత్యామ్నాయం కాదని విమర్శించారు.
2024 ఎన్నికల్లో పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేసే పార్టీలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు కుటుంబాలు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఓపిఎస్‌ అమలు చేసి ప్రజల పక్షాన ఉంటారా.. జిపిఎస్‌ అమలు చేసి కార్పొరేట్ల పక్షాన ఉంటారా ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని అన్నారు. 33 సంవత్సరాల పూర్తయితేనే 50శాతం పెన్షన్‌ ఇచ్చే జిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ కట్టించడం ఉద్యోగుల పాలిట మరణ శాసనమని అన్నారు. ఐదు సంవత్సరాల కొనసాగితే ప్రజాప్రతినిధులకు జీవితాంతం పెన్షన్‌ వస్తున్నదని, 30 సంవత్సరాలు పైబడి చేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకేమో వద్ధాప్యం పెన్షన్‌ కంటే తక్కువ పెన్షన్‌ వస్తున్నదని, ఇది ఏ రాజ్యాంగంలో ఉందో తెలియజేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాలు మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు.
ఈ దీక్షా శిబిరానికి మద్దతుగా ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జి.చెంగల్రాయ మందడి, జిల్లా అధక్షులు కిరణ్‌ కుమార్‌, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి రఘుపతి రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. సోమశేఖర్‌ నాయుడు, జీవి రమణ,నాయకులు పి.సుధాకర్‌ రెడ్డి, పిఆర్‌.మునిరత్నం, రెహానా బేగం, సిపి.ప్రకాష్‌, ఏ.కష్ణమూర్తి, రెడ్డెప్ప నాయుడు, దక్షిణామూర్తి, ఎన్‌.మణిగండన్‌, డి.ఏకాంబరం, బి.ఈశ్వర మహేంద్ర, పిసి.బాబు, సరిత, ఎంవి.రమణ, జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌ శశికుమార్‌, వెంకటేశ్వర రెడ్డి యాదవ్‌, వంశీకష్ణ, వేంకటేశులు, మోహన్‌, రెడ్డెప్ప, నాగరాజ, యువరాణి దీక్షలలో కూర్చున్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
దీక్షలకు సిఐటియు మద్దతు...
పాతపెన్షన్‌ విధానం పునరుద్దరించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మద్దతుగా సంఘీభావాన్ని ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన శిబిరం వద్ద మాట్లాడుతూ 2004లో పెన్షన్‌ విధానం రద్దు చేసినప్పటి నుండి దేశవ్యాపితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు సంవత్సరాలుగా ఉద్యమం సమరశీలంగా నడుస్తున్నదని ఈ పోరాటానికి సిఐటియు మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ పోరాటాన్ని అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని ఈ నిరాహారదీక్ష ఇతర సంఘాలకు, రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిపిఎస్‌ను రద్దు చేస్తానని గత ఎన్నికల్లో హామీనిచ్చారని, తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హామీలు నెరవేర్చినట్లు ఇతను కూడా నెరవేరుస్తాడని ప్రభుత్వ ఉద్యోగులు నమ్మారని, ఇప్పుడు తెలియక వాగ్దానం చేశానని ముఖ్యమంత్రి మోసపూరిత ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఉద్యోగులపట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని విమర్శించారు. సిపిఎస్‌ రద్దుకు చేస్తున్న పోరాటం న్యాయమైనదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్‌ను రద్దుచేసి పాతపెన్షన్‌ విధానం పునరుద్దరించాలని, ఈ ఆందోళనకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. సిపిఎస్‌ రద్దుపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని కోరారు.
పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి (యుటిఎఫ్‌)
పుంగనూరు: జిల్లా కేంద్రంలో పాత పెన్షన్‌ సాధనలో భాగంగా గురువారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పుంగనూరు డివిజన్‌ యుటిఎఫ్‌ నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా నాయకులు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చి, నేడు ఓపిఎస్‌కు బదులుగా జిపిఎస్‌ను తీసుకురావడం దారుణమన్నారు. ఎవరైతే పాత పెన్షన్‌ను తిరిగి అమలు చేస్తారో వారికే తమ మద్దతు వుంటుందని స్పష్టం చేశారు. అన్నింటిలోనూ ఉపాధ్యాయ ఉద్యోగ, పెన్షనర్లకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యుటిఎఫ్‌ నాయకులు రమణ, రెడ్డెప్ప, చెన్నకేశవులు, నరేష్‌ పాల్గొన్నారు.