Nov 02,2023 21:20

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు

ప్రజాశక్తి-నెల్లిమర్ల : వైసిపి ప్రభుత్వం ఓర్వలేక టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై తప్పుడు మద్యం కేసులు పెడుతోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు ఖండించారు. గురువారం నెల్లిమర్లలో తెలుగు మహిళా పార్లమెంట్‌ అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి, బంగార్రాజు ఆధ్వర్యాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చంద్రబాబును జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ, ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగురోడ్డు, అంగళ్లు ఘటనలపైనా కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. చంద్రబాబుకు బెయిల్‌ తధ్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యం టెండర్లలో ఏదో జరిగిపోయిందంటూ కేసు పెట్టారని, మద్యంలో దోచుకున్నదెవరో పసిపిల్లాడు చెబుతాడని ఎద్దేవాచేశారు. మద్య నిషేధం ఏమైంది జగన్‌ రెడ్డీ అని ప్రశ్నించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, కార్యదర్శి లెంక అప్పలనాయుడు, ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న, ఇన్‌ఛార్జి అట్టాడ శ్రీధర్‌, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అవనాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.