Nov 14,2022 23:36

  • కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

ప్రజాశక్తి - విజయవాడ : స్పందనలో అర్జీలను స్వీకరించి అర్జీదార్ల నుండి సమస్యను పూర్తిగా విని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. అర్జీదారులనుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యక్తిగత సమస్య ఎదురైనప్పుడు పరిష్కరించాల్సిన వారి నుండి సానుకూల దృక్పదాన్ని ఏవిధంగా ఆశిస్తామో అదే రీతిన అర్జీదారుడు ఆశిస్తారనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే సమస్యను పరిష్కరించడానికి మార్గాలు కనుగొలుకుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో దాదాపు 50 శాతానికిపైగా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతున్నామన్నారు. మిగిలిన ఆర్జీలు కొన్ని కోర్టుల పరిధిలోను, మరికొన్ని రెవెన్యూ కోర్టుల పరిధిలోను ఉంటున్నాయని, వాటిని ఏవిధంగా పరిష్కారించాలనే ఆలోచన చేయాలని అన్నారు. స్పందనలో 79 వినతులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 30, పోలీస్‌ 14, యంఎయుడి 9, విద్య 8, వైద్య 5, వ్యవసాయ 4, పంచాయతీరాజ్‌ 2, వివిధ శాఖలకు సంబంధించి 7 అర్జీలు నమోదయ్యాయన్నారు. ఈకార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, అసిస్టెంట్‌ డిప్యూటీ కలెక్టర్లు ఎస్‌.రామలక్ష్మి, ఖతీఫ్‌ కౌసర్‌ బానో, డ్వామా పీడి జె.సునీత, డిఇఒ సీివీ రేణుక, ఐసిడిఎస్‌ పీడీ ఎ.ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి కె.అనురాధ, డీఎస్‌వో పి.కోమలి పద్మ, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.