Sep 09,2023 23:51

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
బాపట్ల సముద్ర తీరంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు  యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికి జాలర్లు ఇచ్చిన సమాచారంతో సూర్యలంక అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడారు. మండలంలోని రామాచంద్రాపురం బీచ్ నందు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానిక జాలర్లు అతడిని గమనించి సూర్యలంక అవుట్ పోస్టు పోలీస్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అవుట్ పోస్టు విధులలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎం పోతురాజు వెంటనే స్పందించి రామాచంద్రాపురం బీచ్‌కు చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి సముద్రంలో లోతుకు వెళుతుండడం గమనించి ఒడ్డుకు రావలసిందిగా హెచ్చరించారు. అతడు పట్టించుకోకుండా సముద్రంలోకి వెళుతుండడంతో స్థానిక జాలర్ల సహకారంతో హెడ్ కానిస్టేబుల్ పోతురాజు అతడిని కాపాడి, ఒడ్డుకు తీసుకొని వచ్చి విచారించారు. అతడి పేరు సురేంద్ర ఎమరాన్ అని, ఒరిస్సా  రాష్ట్రమని, ప్రస్తుతం విజయవాడలో ఒక ప్రవేటు కంపెనీలో పనిచేస్తునట్లు  తెలిపాడు. అంతట పోలీస్ సిబ్బంది అతడికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపి వేశారు.