Nov 30,2022 23:38

అడ్డతీగల జిసిసి గోదాము వద్ద ధర్నా చేస్తున్న హమాలీలు

ప్రజాశక్తి-పాడేరు
జిసిసి హమాలీల పెరిగిన కూలి రేట్ల ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో పాడేరు జిసిసి కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, నాలుగు నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల సంస్థ, హమాలీల రాష్ట్ర యూనియన్‌, జేఏసీ ఆధ్వర్యంలో చర్చలు జరిపి క్వింటా 4 రూపాయలు పెంచాలని ఒప్పందం చేసుకుం దన్నారు. నేటికి ఒప్పందాల ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎరియర్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 19 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిసిసి కళాశీల సంఘం అధ్యక్షుడు కుమార్‌, కార్యదర్శి గౌరీ తదితరులు పాల్గొన్నారు.
హమాలీల నిరసన
ముంచింగిపుట్టు : పౌర సరఫరాల గోదాములో పని చేస్తున్న హమాలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎఐటియుసి మండల అధ్యక్షుడు బి.బలరాం డిమాండ్‌ చేశారు. స్థానిక సివిల్‌ సప్లై గోదాము ఎదుట నిరసన చేపట్టారు. పెరిగిన రేటుకు సంబంధిత జిఓను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి మండల అధ్యక్షుడు బి.బలరాం మాట్లాడుతూ, కొత్త కూలి రేట్లు విషయమై రాష్ట్ర సివిల్‌ సప్లై కమిషనర్‌ తో పాటు ఎండీలకు సైతం విన్నవించడం జరిగిందన్నారు. హమాలీలకు పెరిగిన రేటు ప్రకారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీలు కె.శివగణేష్‌, పి.సుబ్బారావు, కె.బిశ్వనాథం, కె.ఫోద్లమ్‌, ఎం.జగన్నాథం పాల్గొన్నారు.
ఆందోళన చేసిన జీసీసి కార్మికులు
అనంతగిరి : కాశీపట్నం గొడౌన్‌ వద్ద జిసిసి కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు వెంకటేష్‌ శ్వర్లు, రవి మాట్లాడుతూ, కూలి రేట్లు గిట్టుబాటు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు డొంబు, తదితరులు పాల్గొన్నారు
పెంచిన కూలి రేట్లు అమలు చేయాలని ధర్నా
అడ్డతీగల : పెంచిన కూలి రేట్లుకు సంబంధించి జిఒ విడుదల చేసి అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని కోరుతూ సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ విభాగంలో పనిచేస్తున్న హమాలీలు బుధవారం స్థానిక గిరిజన కార్పొరేషన్‌ గోదాము వద్ద ధర్నా చేశారు. వీరికి సిఐటియు డివిజన్‌ నాయకులు పి.రామరాజు, మండల అధ్యక్షుడు జి.సురేష్‌ బాబు, వినాయక తాపీ పని వారి సంక్షేమ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షులు బోండ్ల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం క్వింటా ఎగుమతి దిగుమతుల నిమిత్తం రూ.22 చెల్లిస్తుందని, దాని అగ్రిమెంట్‌ 2021 సంవత్సరంతో ముగిసిందని పేర్కొన్నారు. అనంతరం తమ అభ్యర్థన మేరకు మూడు రూపాయిలు అదనంగా పెంచుతూ రాష్ట్ర సివిల్‌ సప్లై ఎమ్‌డి నిర్ణయం తీసుకున్నారని, కాని అది జీవో రూపంలో నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. అందువల్ల ఇక్కడ అధికారులు నేటికీ పాత రేటులనే చెల్లిస్తున్నారని తెలిపారు. పెంచిన మూడు రూపాయలను తక్షణమే జీవో రూపంలో విడుదల చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత నెలలో వచ్చిన తుఫానుకు చింతూరు, ఎటపాక, విఆర్‌.పురం మండలాలకు తొమ్మిది రోజులు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగిందని, వాటికి సంబంధించిన డబ్బులు నేటికీ ఇవ్వలేదని తెలిపారు. అనంతరం గిరిజన కార్పొరేషన్‌ అడ్డతీగల బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌కి వినతి పత్రం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూలీ రేట్లు పెంచకపోతే అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు వద్ద ఎగుమతి దిగుమతులను బంద్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల జట్టుకూలి సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ లంబసింగి శివ, మేస్త్రి మిర్తివాడ రాజబాబు, సెక్రటరీ బోండ్ల సువర్ణ సుంచు రాజు తదితరులు పాల్గొన్నారు.