Mar 13,2023 23:55

కోటవురట్లలో బారులు తీరిన ఓటర్లు

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్‌ కేంద్రాల వల్ల 144 సెక్షన్‌ అమలు చేశారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు పూర్తి కావాల్సి ఉండగా జిల్లాలోని అనేక కేంద్రాల్లో సాయంత్రం 6, 7 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగింది. ప్రధానంగా 37 మంది అభ్యర్థుల ఫొటోలతో కూడిన బ్యాలెట్‌ పెద్దదిగా ఉండడంతో ఎన్నికల సిబ్బంది దానిని మడత పెట్టడం, ఓటర్లకు ఇవ్వడానికి, ఓటర్లు అభ్యర్థులను పరిశీలించి ఓటు వేయడానికి ఎక్కవ సమయం తీసుకుంది. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్లు దాటిన తరువాత ప్రధాన పోటీలో ఉన్న పిడిఎఫ్‌, వైసిపి, టిడిపి, బిజెపి అభ్యర్థులకు సంబంధించిన శిబిరాలు ఏర్పాటు చేశారు. వాటి వద్ద ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తూ సందడి చేశారు.
అనకాపల్లి :అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం, ఉడ్‌ పేట, జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాల, గవరపాలెం ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించగా, 191లో 1132 మంది, 192లో 860, 193లో 938, 194లో 1393, 195లో 1000, 195ఎ లో 653 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 గంటల తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లో నిల్చున్నారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బివి సత్యవతి, జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి జీవీఎంసీ ప్రధాన హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలో ఆరు పోలింగ్‌ కేంద్రాల వద్ద జరిగిన పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి పరిశీలించారు. వైసిపి శిబిరాల వద్ద మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపీ సత్యవతి, ఆ పార్టీ నాయకులు, టిడిపి శిబిరాల వద్ద మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, పిడిఎఫ్‌ శిబిరాల వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌ శంకర్రావు, జి.కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు వైఎన్‌ భద్రం, కోన లక్ష్మణ తదితరులు సందడిగా కనిపించారు.
రాంబిల్లి : మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 834 ఓట్లుగానూ 693 పోలయ్యాయి. పోలింగ్‌ కేంద్రాన్ని పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ ఎన్నికల ఏజెంట్‌ ఎస్‌.సుధాకర్‌ పరిశీలించారు. పిడిఎఫ్‌ శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం సందర్శించి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
అచ్యుతాపురం : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొత్తం 1496 ఓట్లు ఉండగా, 1217 ఓట్లు పోలయ్యాయి. 81 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లు వేయడానికి బాలింతలు సైతం క్యూలో గంటలు తరబడి నిరీక్షించవలసి వచ్చింది. పోలింగ్‌ కేంద్రాలను గేట్లు మూసిన తర్వాత తహశీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీవో విజయలక్ష్మి వచ్చి పోలింగ్‌ జరిగే తీరును పరిశీలించారు.
కె.కోటపాడు : కె.కోటపాడు జిల్లా పరిషత్తు ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన 171, 172 పోలింగ్‌ కేంద్రాల్లో మ్తొత్తం 1676 ఓట్లు ఉండగా, 1293 ఓట్లు పోలయ్యాయి. 77 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. ఉదయం 10గంటల తరువాత సాయంత్రం వరకు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. పోలింగ్‌ కేంద్రం ప్రాంగణాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సందర్శించారు.
చోడవరం : చోడవరంలో పోలింగ్‌ మందకుడిగా సాగింది. 169, 170 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 2722 ఓట్లుగాను, 1777 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునారు. 65 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లకు రెండు పోలింగ్‌ బూతులు మాత్రమే ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. చాలా మంది నిలబడ లేక ఓటు వేయకుండానే వెనుదిరిగారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 13 ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఆయన లోపలికి వెళ్లకుండానే వినుదిరిగారు.
పరవాడ : పరవాడలో ఉదయం 8 గంటలకు మందకొడిగా పోలింగ్‌ ప్రారంభం కాగా, 10 గంటల తరువాత పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. మొత్తం 70.83 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు ఏర్పాటు చేయలేదని ఏజెంట్లు తెలిపారు.
దేవరాపల్లి : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది. మొత్తం 1518 ఓట్లు గాను 1174 ఓట్లు పోలయ్యాయి. మండలం మొత్తం 77.33 శాతం ఓట్లు పోలైనట్టు అధికారులు తెలిపారు. తహశీల్దారు ఎం.లక్ష్మి, ఎంపీడీఓ సిహెచ్‌ సుబ్బలక్ష్మి పర్యవేక్షించారు.
బుచ్చయ్యపేట : స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. మధ్యాహ్నం సమయంలో తీవ్ర ఎండలో సైతం 200 మందికి పైగా ఓటర్లు క్యూలైన్లో వేచి ఉన్నారు. పోలింగ్‌ సమయం ముగిసిన సమయం 4 గంటలకు 300కు పైగా ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు. వారందరూ ఓట్లు వేసే సరికి రాత్రి 8 గంటలైంది.
కశింకోట : మండలంలో మొత్తం 1458 ఓట్లు ఉండగా, 1172 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 80.03 శాతంగా పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారి యడ్ల హరి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ పూర్తయింది. ఓటర్లలో పురుషులు 735 మంది, మహిళలు 437 మంది ఓటు వేశారు.
మునగపాక రూరల్‌ : మునగపాకలో సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఒకటే పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయడంతో పోలింగ్‌ మందకొడిగా జరిగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు నానా ఇక్కట్లు పడ్డారు. కొంతమంది ఓటర్లు క్యూలైన్ల నుండి విసుగుతో వెనుదిరిగారు. మండల వ్యాప్తంగా 1,239 ఓటర్లు ఉండగా 926 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సబ్బవరం : మండలంలోని 1899 ఓట్లు ఉండగా 1304 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1139 పురుషుల ఓట్లకు గాను 788 మంది, 759 స్త్రీల ఓట్లకు గాను 516 మంది ఓటు వేశారు. 68.66 శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 4 గంటలకు లైనులో ఉన్న 378 మందికి టోకెన్‌లు ఇచ్చి రాత్రి 7.25 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు.
యలమంచిలి : యలమంచిలి మున్సిపాలిటీ, రూరల్‌ పరిధిలో మొత్తం ఓట్లు 2,354 ఉండగా 3 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 182 పోలింగ్‌ కేంద్రంలో 797, 182ఎ పోలింగ్‌ కేంద్రంలో 671, 183 పోలింగ్‌ కేంద్రంలో 459 మంది వెరసి 1,933 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.86 శాతం పోలింగ్‌ నమోదైంది. వైసీపీ మద్దతుదార్లు వెయ్యి రూపాయలు నగదు, గోల్డు కాయిన్స్‌ పంచినట్లు, తెలుగు దేశం వారు కొంత నగదు పంచినట్లు ప్రచారం జరిగింది.
అనకాపల్లి : ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు ఎన్నికల అధికారి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులకు పాసులు మంజూరు చేశారు. అయితే పోలీసులు వీరిని పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో తమకు పాసులు ఇచ్చి ప్రయోజనం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. అయితే తమకు వచ్చిన ఆదేశాల మేరకు అనుమతించలేదని తెలిపారు.
అచ్యుతాపురం : అచ్యుతాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ అధికారి వచ్చి గేట్లకు తాళం వేయించారు. గేటు వేస్తుండగానే పోలింగ్‌ కేంద్రానికి ఒక మహిళా ఓటరు రాగా, ఆమెను లోపలకు అనుమతించలేదు. ఈ సమయంలో ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ముందుగా గేట్లు వేశారని టిడిపికి చెందిన రాజాన నానాజీ, కూనిశెట్టి రమణ తదితరులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలింగ్‌ అధికారి ఆదేశాలను తాము పాటించామని సిఐ వై.మురళి రావు వారికి చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు.