ప్రజాశక్తి - ఏలూరు
భద్రతలేని జిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒపిఎస్‌ను అమలు చేయాలని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఏలూరు యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా కోశాధికారి షేక్ ముస్తఫా అలీ అధ్యక్షతన జరిగిన ఏలూరు డివిజన్ సిపిఎస్ సదస్సులో సాబ్జీ మాట్లాడారు. సిపిఎస్, జిపిఎస్ ఏదైనా ఉద్యోగ దోపిడీ అని ఒపిఎస్ అమలే సామాజిక బాధ్యతని చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్ ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయని, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ఒపిఎస్ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.రవికుమార్ మాట్లాడుతూ పోరాటాలు పెరిగి సిపిఎస్ రద్దయ్యే పరిస్థితులు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఒపిఎస్ అమలు కాకుండా జిపిఎస్ అనే కొత్త విధానాన్ని ముందుకు తెచ్చి ఉద్యోగులను మభ్యపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పివి.నరసింహారావు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కోసం అంటూ సమావేశాలు పెడుతూ జిపిఎస్‌ని ముందుకు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా శాఖ సహాధ్యక్షులు బి.సుభాషిణీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి.కనకదుర్గ, జిల్లా కార్యదర్శులు ఎన్.రాంబాబు, ఎస్.సుధారాణి, సిపిఎస్ జిల్లా కన్వీనర్ కె.కమల్, సిపిఎస్ జిల్లా కె.కిరణ్, లక్ష్మణరావు, సిపిఎస్ సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










