
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా: సిపిఎస్, జిపిఎస్ ఒక్కటేనని వాటిని అంగీకరించబోమని ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు ఇచ్చిన హామీని విస్మరించి, అసెంబ్లీలో ఏకపక్షంగా జిపిఎస్ ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు, పల్నాడు కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళన చేపట్టారు. గుంటూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో నిరసన తెలిపి, అనంతరం అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట బైటాయించి ఆందోళన కొనసాగించారు. అనంతరం ఫ్యాప్టో నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో స్థానిక శంకరభారతిపురం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు 'మీకేమో పెన్షనా.. మాకేమో టెన్షనా, పెట్టుబడులు పెన్సన్.. మాకొద్దీ టెన్షన్, ఓపిఎస్ అమలు చేయాల'ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో గుంటూరు, పల్నాడు జిల్లాల చైర్మన్లు ఎం.కళాధర్, సంపత్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల్ని నమ్మించి మోసగించిందని విమర్శించారు. సిపిఎస్, జిపిఎస్ రెండింటిలోనూ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఉంటుందని, రెంటికీ తేడా లేదని అన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ మంజుల ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జిపిఎస్ గ్యారెంటీ పెన్షన్ కాదని, మోసపూరిత స్కీమ్ అన్నారు. హామీ ఇచ్చి, ఎన్నికల్లో గెలిచాక మాట తప్పటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేపడుతున్న నిరసనలు కూడా ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఫ్యాప్టో సభ్యులు తిమ్మన్న మాట్లాడుతూ దేశంలో హామీ ఇవ్వని అనేక రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తే, ఎపి ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చి, నాలుగేళ్ల పాలన తర్వాత జిపిఎస్‌ను తెరపైకి తేవటం మోసం చేయటమేనన్నారు. ఎపిసిపిఎస్‌ఇఎ నాయకులు పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం ఒపిఎస్ పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ జిపిఎస్‌ను ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా బలవంతంగా అమలుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. జిపిఎస్‌లో భద్రతేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు బసవలింగరావు, డి.పెదబాబు, బి.ఆదిలక్ష్మి, జి.వేళాంగిణిరాజు, సుబ్బారెడ్డి, ఎండి.ఖలీద్, మేకల సుబ్బారావు, ఎపిసిపిఎస్‌యుఎస్ నాయకులు తిరుమలరెడ్డి, సిపిఎస్ నాయకులు సిహెచ్.ఆదినారాయణ, జోసఫ్ సుధీర్ పాల్గొన్నారు. నరసరావుపేట కార్యక్రమంలో నాయకులు బేగ్, సిఎం దాస్, ఫ్యాప్టో కో-చైర్మన్లు జి.విజయసారధి, సుభాని, ఎం.శ్రీనివాసరావు, ఎం.మోహనరావు, నాయకులు సుభాని, పి.శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, ఉపాద్యాయులు పాల్గొన్నారు.