Sep 02,2023 00:40

నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ఇతర నాయకులు, ఉద్యోగులు

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వం సిపిఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. ఎపి సిపిఎస్‌ యుఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం తేవాలని ధర్మ పోరాట నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు హాజరై ప్రసంగించారు. సిపిఎస్‌ రద్దుకు జరిగే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్‌ రద్దు చేసి, ఓపిఎస్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.తిరుమలరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో సిఎం తన సుదీర్ఘ పాదయాత్రలో తాము అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామని వాగ్దానం చేశారని, అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటిని హామీ అమలు చేయలేదన్నారు. ఇప్పటికే సిపిఎస్‌ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జిపిఎస్‌ను అంగీకరించబోమని అన్నారు. కార్యక్రమంలో ఎపిఎన్‌జిఒ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.శ్రీనివాసరావు, సతీష్‌కుమార్‌, ఎపిటిఎఫ్‌ 1938 జిల్లా కార్యదర్శి మేకల సుబ్బారావు, ఆదినారాయణ, గణేష్‌, ఎన్‌ఆర్‌కె బాబు, శివన్నారాయణ, కిషోర్‌ ప్రసంగించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఎపిజిఇఎ వినతి
ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఒపిఎస్‌ సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. తొలుత కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో ఎపిజిఇఎ జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా, జిల్లా కార్యదర్శి కెవిఎస్‌ శివారెడ్డి, నగర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ షేక్‌.కరిముల్లా షాఖాదరి, మహిళా నాయకులు నీలిమ, మల్లేశ్వరి, రోజారాణి, పెన్షనర్ల సంఘం నాయకులు పి.కేశవరెడ్డి, గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు షేక్‌.అబ్దుల్‌ రజాక్‌, టివిఎస్‌ మణికంఠ పాల్గొన్నారు.