Sep 23,2023 21:56

మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పార్వతీపురం: రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌కు బదులు ఒపిఎస్‌ను తీసుకురావడాన్ని నిరసిస్తూ ప్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ పిలుపు మేరకు శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు మెడకు ఉరితాళ్లు వేసుకొంటూ నిరసన తెలిపారు. ఈ నిరసనను ఉద్దేశించి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ తీసుకొస్తానని చెప్పి ఉద్యోగులను, ఉపాధ్యాయులను, వారి కుటుంబ సభ్యుల ఓట్లు గుంజుకొని జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టారన్నారు. కానీ ఇప్పుడు సిపిఎస్‌కు ప్రతిరూపంగా ఉన్న జిపిఎస్‌ తీసుకురావడమంటే ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసగించడమేన న్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎపిటిఎఫ్‌(257), ఎపిటిఎఫ్‌ (1938) సంఘ సభ్యులు పిసిహెచ్‌ శ్రీనివాసరావు, నల్ల బాలకృష్ణ, ఎం.శివున్నాయుడు, ఎపిసిపిఎస్‌ఇఎ నాయకులు బి.సంతోష్‌ మాట్లాడుతూ 25న జరిగే చలో కలెక్టరేటును ఉపాధ్యాయులు, ఉద్యోగుల విజయవంతం చేయాలని కోరారు. ఈ నిరసనకు సంఘీభావంగా పిఆర్‌టియు నాయకులు కె.విజరు పాల్గొన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌, అధిక సంఖ్యలో ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిపిఎస్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పాలకొండ ఫ్యాప్టో నాయకులు ఎస్‌.వాసుదేవరావు, జి.సూర్యనారాయణ, టి.ఉమామహేశ్వరరావు, బివి రమణ, కె.పద్మజ, ఎ.నాగరాజు, వీరఘట్టం ఫ్యాప్టో నాయకులు పైడిరాజు, కె.గోవిందరావు, స్వామిబాబు, సీతంపేట ప్యాప్టో నాయకులు కె.కృష్ణారావు, ఎ.రామారావు, ఎపిసిపిఎస్‌ఇఎ నాయకులు కెసిహెచ్‌ అప్పలనాయుడు, ఎ.రాంబాబు, అన్నాజీ, సుధాకర్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మరిచి నాలుగేళ్లు అధికారం తర్వాత ఇప్పుడు జిపిఎస్‌ కొత్త విధానాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తున్నా బలవంతంగా ప్రభుత్వం ప్రతిపాదించడం, క్యాబినెట్‌ అంగీకారం తెలపడం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను మోసగించడమేనన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ బుచ్చయ్యకు వినతిని అందజేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.పరాంకుశం నాయుడు, జి.జయలక్ష్మి, కెడికె మోహన్‌, ఎం.సంపత్‌ కుమార్‌, ఎస్వీ రమణ, జి.మోహన్‌ రావు, కామరాజు, కాంతారావు, కోటేశ్వరరావు, కె.పారయ్య, వి.రాంబాబు పాల్గొన్నారు.
సాలూరు :జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ శనివారం ప్యాఫ్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఫ్యాఫ్టో నాయకులు బి.విజయకుమార్‌, కె.జానకీరావు ఆధ్వర్యాన ఉపాధ్యాయులు వై నాట్‌ ఒపిఎస్‌ అంటూ నినాదాలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌తో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఒపిఎస్‌తో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని నాయకులు విజయకుమార్‌ హెచ్చరించారు.