ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రదాన కార్యదర్శులు సి.లింగమయ్య, వి.గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ స్థానంలో ఓపిఎస్ అమలు చేయకుండా జిపిఎస్ అంటూ ఏకపక్షంగా అమలుకు సిద్ధమైందన్నారు. జిపిఎస్ విధానంతో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందన్నారు. సిపిఎస్ విధానానికి జిపిఎస్ విధానానికి ఏమాత్రం వ్యత్యాసం లేదన్నారు. అలాగే సర్వ శిక్ష అభియాన్‌లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు సిఆర్‌పిలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్‌టి, ఆర్ట్, క్రాఫ్ట్ సిబ్బందికి మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌వివి.రమణయ్య మాట్లాడుతూ ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, వెంటనే వారందరికీ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా పని చేసిన ఉద్యోగికీ 1వ తేదీన జీవితం చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ సహాధ్యక్షులు రామప్ప చౌదరి, సరళ, కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు దేవేంద్రమ్మ, జిల్లా కార్యదర్శులు సంజీవ్ కుమార్, అబ్దుల్ వహాబ్ ఖాన్, రాముడు, రాష్ట్ర కౌన్సిలర్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్ నాయకులు










