Sep 25,2023 22:09

నిరసన వ్యక్తం చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : జిపిఎస్‌ సిపిఎస్‌ ను రద్దుచేసి ఒపిఎస్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ పుట్టపర్తిలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద నుండి గణేష్‌ కూడలి వరకు ఉపాధ్యాయులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గణేష్‌ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌ ప్రభుత్వం హామీలతో కాలం గడుపుతోందని విమర్శించారు.ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గంట పాటు నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉపాధ్యాయులు పోలీసులు మధ్య తోపులాట జరిగింది. ఉద్యమాలను ఆపాలనుకోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని ఫ్యాప్టో కో చైర్మన్‌ యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు మారుతీ శ్రీనివాసులు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి , నరేష్‌ గంగాధర్‌, ఆది, పెద్ది రాజు, శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.