
నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
ప్రజాశక్తి - యలమంచిలి
సిపిఎస్ స్థానంలో అత్యంత దుర్మార్గమైన జిపిఎస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం మండలంలోని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి.క్రాంతి కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమానుషమైన సిపిఎస్‌ను రద్దుచేసి అంతకంటే దుర్మార్గమైన జిపిఎస్‌ను బలవంతంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులపై రుద్దే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పి.రామ్మూర్తినాయుడు, నాయకులు ఎస్‌ఎస్‌వి.అవధాని, బివి.విజయపద్మ, రామేశ్వరపు సత్యనారాయణ, దొమ్మేటి చంద్రశేఖరరావు, సఖిలే వెంకటేశ్వరరావు, డివివి ఆదినారాయణ, టి.గాంధీ, వైవి.చల్లారావు, ఎస్.వెంకట రామయ్య పాల్గొన్నారు.
మొగల్తూరు : సిపిఎస్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ చేయడం ఉద్యోగులను మోసగించడమేనని యుటిఎఫ్ నాయకులు అన్నారు. శుక్రవారం కెపిపాలెంలోని జెడ్‌పి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర యుటిఎఫ్ కౌన్సిలర్ చింతపల్లి కృష్ణమోహన్, ఎడ్లపల్లి ధర్మారావు, వాటాల సత్యనారాయణ, ఉమాదేవి, కెవి.మంగతాయారు, జితేంద్ర కుమార్, కళాకార్ రాజు, మస్తాన్, శ్రీనివాసరావు, రవి, శ్రీనివాస బాబు పాల్గొన్నారు.
కాళ్ల:జిపిఎస్, సిపిఎస్ రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సిహెచ్ పట్టాభిరామయ్య కోరారు. శుక్రవారం లక్ష్మీ నరసింహపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై భోజన సమయంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్.పట్టాభిరామయ్య, ఉపాధ్యాయులు ఎవివి.సత్యనారాయణ, ఎన్.సీతాదేవి, జిడబ్ల్యూ.విక్లిఫ్ కుమార్, కె.రాంబాబు, కె.కృష్ణమూర్తి ఎన్‌ఎ.నరసింహరాజు పాల్గొన్నారు.
తణుకురూరల్ : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 2004 తరువాత సర్వీస్‌లో చేరిన వారందరికీ పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎపిటిఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ.రాజగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిపిఎస్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కెబినెట్ సమావేశంలో ఆమోదింపజేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాఫ్టో పిలుపుమేరకు అన్ని పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎస్ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ విరమణ అనంతరం రూ.వెయ్యి నుంచి రూ.1500 మాత్రమే వస్తుందని, వృద్ధాప్యంలో బతుకు దుర్లభమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల-3 ఉపాధ్యాయులు కె.అంజిబాబు, జె.రాజకుమార్, కె.కామాక్షి, కెఎస్.ప్రదీప్ పాల్గొన్నారు.