
ఒపిఎస్‌నే అమలు చేయాలి
- యుటిఎఫ్ నేతలు డిమాండ్
- బొమ్మలసత్రం వద్ద నిరవధిక దీక్షలు
ప్రజాశక్తి - నంద్యాల
సిపిఎస్, జిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పివి.ప్రసాద్, సుధాకర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం నంద్యాలలోని బొమ్మల సత్రం వద్ద ఉదయం 10 గంటల నుండి యుటిఎఫ్ జిల్లా శాఖ అధ్వర్యంలో ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం విజయవాడలోనియుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద ఈ నెల 18వ తేదీ నుండి నిరవధిక దీక్షలకు చేపడుతున్నట్లు చెప్పారు. 19వ తేదీ అన్ని జిల్లాల్లో జిల్లా నాయకత్వం, 20వ తేదీ తాలూకా డివిజన్ కేంద్రాలలో, 21వ తేదీ అన్ని మండల కేంద్రాల్లో మండల నాయకత్వం, కార్యకర్తలు దీక్షలకు కూర్చుంటున్నట్లు చెప్పారు. ఈ దీక్షలలో సిపిఎస్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1.9.2004 ముందు నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న 11 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. ఈ దీక్షలకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘం, ఉద్యోగ, సిపిఎస్ సంఘాలు, జెఎసి, ప్రజాసంఘాలు తదితర నాయకత్వాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అనేకమంది ఈ ఉద్యమంలో పాల్గొని ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని సాధించేవరకు కలిసి పోరాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్య ప్రకాష్, రామ్ మోహన్, రామ కృష్ణుడు, బాల స్వామి, అరవింద్, వేంకటేశ్వర రెడ్డి, ప్రతాప్, రామకృష్ణా రెడ్డి, గోపాల్, జాన్ సన్, మధు, రవి, రమణ, రామ్ నాయక్, వేంక టేశ్వర్లు, రామకృష్ణ, లింగమయ్య, శ్రీనివాసులు, పూజారి శ్రీనివాసులు, గోపాల్, నాగమయ్య, సోమయ్య, ఫిదా హుస్సేన్, మల్లిఖార్జునప్ప, బనగాన పల్లె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.