Oct 19,2023 23:34

గుంటూరులో దీక్షలను ప్రారంభిస్తున్న కెఎస్‌ లక్ష్మణరావు ఇతర నాయకులు

ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లా : సిపిఎస్‌, జిపిఎస్‌ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, పాత పెన్షన్‌ విధానం రద్దు చేసే వారికే రానున్న ఎన్నికల్లో ఓట్లు వేస్తారని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. సిపిఎస్‌, జిపిఎస్‌ వంటి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ ఉన్న ఏ విధానమైనా అంగీకరించేది లేదని, ఒపిఎస్‌ అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు, ఒపిఎస్‌ సాధనకు యుటిఎఫ్‌ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట గురువారం నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించారు. తొలుత యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు కె.జోజయ్య, దుర్గారావు, తాండవకృష్ణ, రాష్ట్ర, జిల్లా నాయకులు దీక్షా శిబిరం వద్ద ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత చెన్నుపాటి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నసరావుపేటలోని ధర్నా చౌక్‌ వద్ద దీక్షలను ఉపాధ్యాయులకు పూల మాలలు వేయడం ద్వారా వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జి.రవిబాబు ప్రారంభించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో యుటిఎఫ్‌ దీక్షలకు రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ సంఘీభావం తెలిపారు. మధు మాట్లాడుతూ ఒపిఎస్‌ అమలు కోసం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తే ఒపిఎస్‌ అమలు చేస్తామని కెసిఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. గఫూర్‌ మాట్లాడుతూ జిపిఎస్‌ విధానంతో ఉద్యోగులు రగిలిపోతున్నారని, అయితే అక్రమ కేసులతో ఇబ్బందులు పెడతారని భయంతో ఉద్యోగులు మాట్లాడలేకపోతున్నారని చెప్పారు. ఈ క్రమంలో యుటిఎఫ్‌ ఉపాధ్యాయులు ముందుకొచ్చి ఒపిఎస్‌ కోసం పోరాడ్డం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా 40 ఏళ్ల పాటు సేవ చేసిన వ్యక్తుల బాధ్యత ప్రభుత్వాన్ని కాదా? అని ప్రశ్నించారు. గుంటూరు దీక్షలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం గత ఎన్నికల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, మాట తప్పిందన్నారు. నాలుగున్నరేళ్ల పాలన తర్వాత జిపిఎస్‌ను తెరపైకి తెచ్చిందని, ఇది కూడా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తోనే ఉంటుందని అన్నారు. హామీ ఇవ్వకపోయినా అనేక రాష్ట్రాల్లో సిపిఎస్‌ రద్దు చేసి, ఒపిఎస్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మాత్రం అమలు చేయకపోటం అన్యాయమన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఉద్యోగులకు పలు పార్టీలు ఒపిఎస్‌ హామీ ఇస్తున్నాయన్నారు. ఏపీలోనూ సిపిఎస్‌ రద్దు చేసే వారికే ఉద్యోగులు ఓటు వేస్తారని స్పష్టం చేశారు. జోజయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న పెన్షన్‌ విధానాన్ని పాలకులు కార్పొరేట్ల కోసం నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌.కుసుమకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం పాత పెన్షన్‌ ఇస్తామని మోసగించిందని విమర్శించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌ మాట్లాడుతూ పండుగ సెలవుల్లో సైతం యుటిఎఫ్‌ ఈ ఉద్యమానికి సిద్ధమవటం, అన్ని జిల్లాల్లో విజయవంతంగా దీక్షలు జరగటం జిపిఎస్‌ పట్ల సిపిఎస్‌ ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేతకు నిదర్శమన్నారు. ఒపిఎస్‌ సాధించే వరకూ ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 2003 నోటిఫికేషన్‌ ద్వారా 2004లో ఉద్యోగాల్లో చేరిన వారికి ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేటలో దీక్షలో యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి మాట్లాడుతూ జిపిఎస్‌ విధానం అంటే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లడమేనన్నారు. రాజకీయ పార్టీలు విశ్వసనీయతను నిలబెట్టుకోవాలని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి సిపిఎస్‌ రద్దుపై ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఒపిఎస్‌కు జిపిఎస్‌ ప్రత్యామ్నాయం కాదని, ఇది వంచనేనని మండిపడ్డారు. షేర్‌ మార్కెట్లో లాభనష్టాలపై ఆధారపడే పెన్షన్‌ ద్వారా సామాజిక భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ మద్దతు తెలిపారు. భవిష్యత్‌ తరాలకు విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణ కలిగిన పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం రోడ్డేక్కాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైన ఒపిఎస్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. యుటిఎఫ్‌ చేసే పోరాటాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. గుంటూరు దీక్షల్లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎఎల్‌. శివపార్వతి, జిల్లా కార్యదర్శులు సిహెచ్‌.ఆదినారాయణ, ఎమ్‌డి.షకీలాబేగం, జి.వెంకటేశ్వరరావు కూర్చుకున్నారు. జిల్లా కోశాధికారి ఎమ్‌డి.గయాసుద్దౌలా పాల్గొన్నారు. నరసరావుపేట దీక్షలో కె.శ్రీనివాసరెడ్డి, జె.వాల్యా నాయక్‌, టి.అరుణ్‌ కుమార్‌, షేక్‌ జమాల్‌, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, బి.కాంతారావు, షేక్‌ అయేషా సుల్తానా, ఎన్‌.పద్మావతి, వి.నాగేశ్వరరావు, ఎ.నాసర్‌ రెడ్డి, కె.కోటేశ్వరరావు, పి.రమేష్‌బాబు పాల్గొన్నారు.