పార్వతీపురం రూరల్: సిపిఎస్, జిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎస్ రద్దుచేసి ఒపిఎస్ సాధన కొరకు ప్రాణాలైనా అర్పిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ ఫర్ ఒపిఎస్ అనే నినాదంతో ముందుకెళ్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఐదేళ్లు అవుతున్నా రద్దు చేయకుండా జిపిఎస్ పేరుతో ఉద్యోగులను నమ్మించి మోసం చేశారన్నారు. జిపిఎస్ మా కొద్దని, ఒపిఎస్ అమలు చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. . దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వకుండానే సిపిఎస్ ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేస్తున్నాయన్నారు. లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నా ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నిరాహార దీక్షలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు టి.రమేష్, ప్రధాన కార్యదర్శి ఎస్.మురళీమోహన రావు, రాష్ట్ర కౌన్సిలర్, సిపిఎస్ కౌన్సిలర్ ఎం.శంకర రావు, కో-కన్వీనర్ పి.సుధా జిల్లా సహాధ్యక్షులు బి.విజరుకుమార్ కూర్చున్నారు. దీక్షలకు జెఎసి నాయకులు జివిఆర్ కిషోర్, జిల్లా ప్రధాన ఉపాధ్యాయుల సంఘం నాయకులు పిసిహెచ్ శ్రీనివాసరావు, ఎపిటిఎఫ్ కూర్మినాయుడు, సిపిఎం నాయకులు ఎం.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, టిడిపి నాయకులు బోనెల విజయచంద్ర, ఎస్‌ఎఎపి నాయకులు గోవిందు, పిఇటిల సంఘం నాయకులు మురళి, విఆర్‌ఒలు, పెన్షనర్ల సంఘాల నాయకులు సింహాచలం, జగన్నాథం, మనోభాయి, ప్రముఖ కవి గంటేడ గౌరినాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు మద్దతు తెలిపారు.










