ప్రజాశక్తి-అమలాపురం రూరల్
పాత పెన్షన్ సాధన కోసం ఫ్యాప్టో ఛైర్మన్ నాగిరెడ్డి శివప్రసాద్, జనరల్ సెక్రటరీ పెయ్యల వీరభద్రరావు ఆధ్వర్యంలో శనివారం అమలాపురం పాత తాలూకా కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఎపి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా జిపిఎస్ అమలు కోసం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందడం పట్ల, సిఎం ప్రతిపక్షంలో ఉండగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తానని ఇచ్చిన హామీని గాలికి వదిలిన తీరుకు ఈ నిరసన చేపట్టినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. జిపిఎస్ ను ఉద్యోగులపై బలవంతంగా అమలు చేస్తే రాబోయే ఎన్నికలలో ప్రస్తుత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిపిఎస్ బిల్లును ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, పాత పింఛను విధానం పునరుద్ధరించాలని ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఎ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు, ఏపీసిపిఎస్‌ఎ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట సిపిఎస్ ఉద్యోగులకు తీవ్రనష్టం కలిగించే జిపిఎస్ అమలును నిలిపివేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ పాత తాలూకా స్థాయి లో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం మండలాల ఫ్యాప్టో నాయకులు ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం పిలుపుమెరకు శనివారం సాయంత్రం స్థానిక తహసిల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహశీల్దారుకు మెమెఉరాండం అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జివి.రమణ, వై.మురళి, టి.విజయ కృష్ణ, వి.బాలకష్ణ, బి.నారాయణ, జి.నాగేశ్వరరావు, కె.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.










