Oct 12,2023 23:48

గుంటూరు: సిఎం జగన్మోహన్‌రెడ్డి 2019 పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామని ఇచ్చిన వాగ్థానాన్ని నిలబెట్టుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు పోస్టు కార్డు ఉద్యమం గురువారం స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున యుటిఎఫ్‌, ఇతర ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం సిపిఎస్‌ రద్దు చేయకుండా, జిపిఎస్‌ను ముందుకు తెచ్చిందన్నారు. జిపిఎస్‌ కూడా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ కట్టించుకునే విధానమేనని, దీని వల్ల రిటైర్‌ అయిన తర్వాత పెన్షన్‌కు గ్యారెంటీ లేదన్నారు. గ్యారెంటీ లేని పెన్షన్‌ విధానం తీసుకొచ్చి దేశం మొత్తానికి ఆదర్శమని చెప్పటం శోచనీయమన్నారు. పాత పెన్షన్‌ విధానంతోనే ఉద్యోగులకు లాభం ఉంటుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2017లో ఇచ్చిన మెమో ప్రకారం 2003 డిఎస్సీ ద్వారా నియామకం పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓపిఎస్‌ పునరుద్ధరణకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని, సిఎంకు కార్డులు రాయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌, రాష్ట్ర ప్రచురణల కమిటీ కన్వీనర్‌ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్య క్షులు జి.వెంకటేశ్వర్లు, ఎఎల్‌. శివపార్వతి, కార్యదర్శులు ఆదినారాయణ, షకీలాబేగం, వెంకటేశ్వరరావు, గోవిందయ్య, రంగారావు, ప్రేమ్‌కుమార్‌, ప్రభూజీ తదితరులు పాల్గొన్నారు.