Nov 19,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మిరాజ

 కడప అర్బన్‌ : సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే వారికే రాబోయే ఎన్నికలలో తమ మద్దతు ఉంటుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మీరాజ, ఎస్‌.ఎస్‌.నాయుడు పేర్కొన్నారు. ఆదివారం యుటిఎఫ్‌ భవన్లో జిల్లా అధ్యక్షుడు మాదన విజయ కుమార్‌ అధ్యక్షతన యుటిఎఫ్‌ ద్వితీయ జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్‌ సమా వేశాలలో ఎస్‌టిఎఫ్‌ఐ పతాకాన్ని బి.లక్ష్మీరాజ, యుటిఎఫ్‌ పతాకాన్ని మాదన విజయకుమార్‌ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బి.లక్ష్మీరాజ, ఎస్‌.ఎస్‌.నాయుడు మాట్లాడుతూ పాలకవర్గాలు ఉద్యోగ, ఉపాధ్యా యులను వంచించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికా రంలోకి వస్తే వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించాడన్నారు. ఆ హామీని నిజమని నమ్మి ఉద్యోగ, ఉపాధ్యాయులు జగన్మోహన్‌ రెడ్డిని గద్దెనెక్కిస్తే, అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించారని చెప్పారు. సిపిఎస్‌ రద్దుపై నాలుగేళ్లు కాలయాపన చేసి సిపిఎస్‌ రద్దు సాధ్యం కాదని ఆ స్థానంలో జిపిఎస్‌ పేరుతో గ్యారంటీ లేని గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేసి ఉద్యోగులను మరోసారి దగా చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, విద్యను ప్రైవేటీక రించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే సాకుతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీ ర్యం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి విద్యను అందకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల పక్షపాతిగా తనకు తాను ప్రకటించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని ప్రకటించి, ఉన్న వేతనాలలో కోత విధించిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారని ఎద్దేవా చేశారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత కోల్పోతే అధికారంలో కొనసాగను అని ముఖ్యమంత్రి పలికిన పలుకులకు విశ్వసనీయతే లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఏపీజిఎల్‌ఐ సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ, పిఆర్సీ, సరెండర్‌ లీవ్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎపిజిఎల్‌ఐ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్‌, పాలెం మహేష్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమను ప్రశ్నిస్తే సహించే స్థితిలో లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన ఉపాధ్యాయులపై కక్షగట్టి వేధింపులకు పాల్పడుతున్నదని విమ ర్శించారు. పాఠశాలల పర్యవేక్షణ పేరుతో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉపాధ్యాయులను నిరంతరం వేధిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులను నిరంతరం బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ పేద, బడుగు, బలహీన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందకుండా చేస్తు న్నారన్నారు. యుటిఎఫ్‌ ఆవిర్భవించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించామని, ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌, జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.డి.దేవదత్తం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యా యులంటేనే భయపడుతున్నదని, ఆ భయానికి కారణమేంటో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. హామీలను అమలు చేయాలని ఉపాధ్యా యులు ఉద్యమిస్తుంటే, ఉపాధ్యాయులపై కన్నెర్ర చేస్తూ ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలే తప్ప ఉద్యమాలపై నిర్బంధం సమస్యలకు పరిష్కారం కాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అన్ని రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్‌.నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్‌, డి.సుజాత రాణి, జిల్లా కార్యదర్శులు జడ్‌.జయరామయ్య, డి.వి.రవీంద్రుడు, చెరుకూరి శ్రీనివాసులు, సి.వి.రమణ, కె.చెన్నయ్య, ఎస్‌.ఎజాస్‌ అహ్మద్‌, ఎల్‌.చంద్ర ఓబుళ్‌ రెడ్డి, వి.పర్వీన్‌ వి.మురళీకష్ణ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.ఓబుల్‌ రెడ్డి, డి.రూతు ఆరోగ్య మేరీ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు పాల్గొన్నారు.