Oct 22,2023 21:46

సమావేశంలో మాట్లాడుతున్న మాదన విజయకుమార్‌

బద్వేలు : ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాల్సింది పోయి, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు భిన్నంగా జిపిఎస్‌ విధానాన్ని అమలు చేస్తూ చట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తగు మూల్యం చెల్లించక తప్పదని యుటిఎఫ్‌ కడప జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్‌ హెచ్చరించారు. జిపిఎస్‌ విధానాన్ని చట్టం చేస్తూ గెజిట్‌ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామన్న జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌ అందుకు భిన్నంగా అత్యంత దుర్మార్గపూరితమైన జిపిఎస్‌ విధానాన్ని తీసుకొనిరావడం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల గొంతు కోయడమేనన్నారు. మాట తప్పం, మడమ తిపం, విశ్వసనీయత కోల్పోతే అధికారంలో కొనసాగం అనే మాటలు వట్టి మాటలేనని తేలిపోయిందన్నారు. గ్యారెంటీ పెన్షన్‌ స్కీం పేరుతో గ్యారెంటీ లేని పెన్షన్‌ అమలు చేస్తూ, జిపిఎస్‌ విధానం దేశానికే ఆదర్శమని ప్రగల్బాలు పలకడం ఈ ప్రభుత్వానికే చెందిందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల శ్వేత పత్రాన్ని విడుదల చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో పాత పెన్షన్‌ విధానం రాజకీయ అజెండాగా మారబోతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపులకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో యుటిఎఫ్‌ బద్వేలు మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌.మహమ్మద్‌ గౌస్‌, ట్రెజరర్‌ ఎ.గుర్రయ్య, గోపవరం మండల అధ్యక్షుడు వీరదాసరి క్రిస్టఫర్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ కె.సుధాకర్‌ పాల్గొన్నారు.
గత డిఎ బకాయిల సంగతి తేల్చండి
కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరువు భత్యానికి సంబంధించిన బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు విమర్శించారు. ఆదివారం యుటిఎఫ్‌ భవన్‌ లో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబర్‌ 133 ద్వారా 2022, జులై నుంచి 2023, అక్టోబర్‌ వరకు 16 నెలలు బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. నవంబర్‌ నుంచి జీతంతో కలిపి చెల్లిస్తాం అంటూ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. గతంలో కూడా 2022, జనవరి డిఎ కు సంబంధించి 18 నెలల బకాయిలు ఇంతవరకు ఒక్క పైసా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించిన పాపాన పోలేదని తెలిపారు. ఇంకా రెండు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందని విమర్శించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనన్న విషయం గుర్తెరిగి వారికి న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనారోగ్యం, అత్యవసరమైన కార్యక్రమాల కోసం అని ప్రభుత్వం వద్ద దాచుకున్న సొంత డబ్బులు చెల్లించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఏపీ జిఎల్‌ఐ, సరెండర్‌ లీవు, మెడికల్‌ బిల్లు తదితర ఆర్థిక బకాయిల నన్నింటిని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట దుర్మార్గపూరితమైన జిపిఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తే ఆ దీక్షలను పోలీసులు చేత భగం చేయించి ఏకపక్షంగా జిపిఎస్‌ కు గవర్నర్‌ ఆమోదం తో గెజిట్‌ విడుదల చేయడం ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం ఇదే మొండి వైఖరితో ముందుకు వెళితే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని, హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రాలేదన్న సంగతిని ఈ ప్రభుత్వం మరువకూడదని తెలిపారు.ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో, ఎమ్మెల్సీలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉధతమైన పోరాట కార్యక్రమాల ద్వారా సమస్యలు పరిష్కరిం చుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శి సి.వి. రమణ, నాయకులు దావుద్దీన్‌,కిరణ్‌ కుమార్‌, జావిద్‌,సుజిత్‌ పాల్గొన్నారు.