
ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, జిఒ 117ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా చైర్మన్ దాసరి జోజిబాబు డిమాండ్ చేశారు. శనివారం ఫ్యాప్టో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 12 గంటల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యకలాపాల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. క్రమం తప్పకుండా ఉద్యోగోన్నతులు కల్పించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. జివిఎంసిలో మ్యాపింగ్ పేరుతో 14 మంది ఉపాధ్యాయులకు నాలుగు మాసాలుగా జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు టి.అంబేద్కర్, టి.రామకృష్ణారావు, ఎ.ధర్మేందర్ రెడ్డి, ఆర్‌వి.వీరభద్రరావు, ఎన్.జయశ్రీ, ఎన్.ధనుంజయరావు పాల్గొన్నారు. దీక్షకు ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.భానుమూర్తి మద్దతు తెలిపారు.
అనకాపల్లి : ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్‌లో మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారన్నారు. జిఓ 117 వల్ల ప్రాథమిక పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొందని, తక్షణమే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. పిఎఫ్/ ఏపీజిఎల్‌ఐ డబ్బులను ప్రభుత్వం దారిమళ్లించి తమ సొంత ఖర్చులకు వాడుకోవడం అన్యాయమన్నారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ వై.సుధాకర్‌రావు మాట్లాడుతూ బదిలీ అయిన ఉపాధ్యాయులకు మూడు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించలేని చేతకాని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్.సన్యాసి నాయుడు, కార్యవర్గ సభ్యులు మధు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమరాన త్రినాథ్, వత్సవాయి శ్రీలక్ష్మి, ప్రేమ్ కుమార్, సిహెచ్.నాగేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు, గణేష్, వై.శ్రీనివాసరావు, జోగా రాజేష్, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.