ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న చలో జిల్లా కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని ఫ్యాఫ్టో, ఎపిసిపిఎస్ ఎంప్లాయిస్ సంఘాలు పిలుపునిచ్చాయి. శనివారం స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ నాలుగేళ్ల అధికారం తరువాత జిపిఎస్ తీసుకొచ్చి ఉపాధ్యాయులను, ఉద్యోగులను మోసం చేశారని అన్నారు. జిపిఎస్ విధానాన్ని ఉపాధ్యాయ. ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తూ ఉన్నా బలవంతంగా ప్రభుత్వం ప్రతిపాదించడం,. క్యాబినెట్ అంగీకారం తెలుపడం అందరినీ మోసం చేయడమేనని అన్నారు. ఈనేపథ్యంలో తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫ్యాఫ్టో నాయకులు జె. రమేష్ చంద్ర పట్నాయక్, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, పాల్తేరు శ్రీనివాసరావు, వి. రమణ, ఎపిసిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్. శివకుమార్, కె. భీమంజయ పట్నాయక్, జి. శ్రీనివాసరావు, ఎస్.అప్పలనాయుడు, జి.త్రినాధ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి పిఆర్‌టి నాయకులు సంఘీభావం తెలిపారు.










