ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
జిపిఎస్, సిపిఎస్‌లు రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) అమలు చేయాలని ఎపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సాల్మన్ రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు వివిధ సమస్యలపై అర్ధనగంగా మోకాళ్లపై వినూత్న నిరసన తెలిపారు అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సాల్మన్‌రాజు మాట్లాడుతూ సిపిఎస్‌ను, కొత్తగా ప్రవేశపెట్టదల్చిన జిపిఎస్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ తన వైఖరి మార్చుకోవాలని, ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించొద్దని కోరారు. ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రెడ్డిదొర మాట్లాడుతూ జిఒ 117ను రద్దు చేయాలని, ఈ జిఒ వల్ల విద్యారంగంలో జరిగిన నష్టాన్ని వెంటనే పూరించాలని, 11వ పిఆర్‌సి ఎరియర్లను ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.రంగావలి మాట్లాడుతూ ప్లస్2 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులకు పిజిటి, జూనియర్ లెక్చరర్ హోదా కల్పించాలని, వారికి పిజిటి స్కేల్ వర్తింపజేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ వెంటనే విడుదల చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు, బదిలీలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్‌టియు ఉమ్మడి పశ్చిమ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి.రామారావు, కొండయ్య, షకీలాబేగం, రమాదేవి, రత్నం, గణేష్, బలరాం, నాగేశ్వరావు పాల్గొన్నారు.










