Jul 19,2023 00:25

జెసిబితో చెట్టును తొలగిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి- కె.కోటపాడు
ఒంటరి మహిళపై వైసిపి సర్పంచ్‌ దౌర్జన్యం చేశారు. ఆ కుటుంబం 20 ఏళ్లగా పెంచుకుంటున్న చెట్లను జెసిబితో తొలగించారు. వాటిని ఆ మహిళ ఇంటికి వెళ్లే మార్గానికి అడ్డుగా వేసి తోవను మూసివేశారు. చెట్ల తొలగింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఆ ఒంటరి మహిళను సర్పంచ్‌ చెయ్యి పట్టుకొని వెనక్కి తోసేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి....
కె.కోటపాడు మండలం, వి.సంతపాలెం గ్రామంలో గోగాడ ఈశ్వరమ్మ (ఒంటరి మహిళ) కుటుంబం తమ స్థలంలో 40 సంవత్సరాలుగా నివాసముంటుంది. ప్రధాన రహదారి నుండి తమ నివాసానికి సొంత డబ్బులు రూ.3 లక్షలు ఖర్చు చేసి రోడ్డు (తోవ) ఏర్పాటు చేసుకున్నారు. ఇంటికి వెళ్లే మార్గంలోనూ, చుట్టూ చెట్లు కూడా పెంచుకున్నారు. ఇది ఇలా ఉండగా, వైసిపికి చెందిన ఆ గ్రామ సర్పంచ్‌ సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో జెసిబిని తీసుకొచ్చి స్థానికంగా కొంత మంది సహకారంతో ఒంటరి మహిళ ఈశ్వరమ్మ కుటుంబం 20 సంవత్సరాల నుంచి పెంచుకున్న కొబ్బరి, వేప, మునగ, నిమ్మ, అరటి, యూకలిప్టస్‌ చెట్లను తొలగించారు. ఆ చెట్లను ఈశ్వరమ్మ కుటుంబం నిర్మించుకున్న తోవకు అడ్డంగా వేసి తోవ మూసివేశారు. చెట్లు తొలగింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఈశ్వరమ్మ చెయ్యిను సర్పంచ్‌ పట్టుకొని వెనక్కి లాగేసి దౌర్జన్యం చేశారు.
సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి : సిపిఎం
సంఘటనా స్థలాన్ని మంగళవారం సిపిఎం మండల కార్యదర్శి ఆర్‌.ముత్యాలనాయుడు, నాయకులు ఎర్ర దేముడు, వి.సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈశ్వరమ్మ కుటుంబం ఇంటికి వెళ్లే రోడ్డు, వారు పెంచిన చెట్లు బంజరు భూమిలో ఉన్నాయని కొన్ని సంవత్సరాలు క్రితం రెవెన్యూ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు నాటి తహశీల్దారు వచ్చి పరిశీలించారని, ఇళ్లకు వెళ్లే దారిని తొలగించకూడదని చెప్పి, చెట్లు ఉన్న భూమిలో బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఆ భూమి ప్రభుత్వ అవసరాలకు ఏమైనా అవసరమైతే అనుభవంలో ఉన్న ఈశ్వరమ్మకు ముందుగా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చిన తరువాత రెవెన్యూ వారు మాత్రమే చర్యలకు వెళ్లాల్సి ఉందని, దారి మూసివేయడానికి వీళ్లేదని పేర్కొన్నారు. కాని ఇక్కడ ఆ భూమి ప్రస్తుతం ప్రభుత్వానికి అవసరం లేదని, ఈశ్వరమ్మకు రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. కాని ఎటువంటి సంబంధం లేని సర్పంచ్‌ దౌర్జన్యం చేసి చెట్లు తొలగించి, దారి మూసి వేశారని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే 20 సంవత్సరాలు వయసున్న చెట్లు తొలగించేటప్పుడు సంబంధిత అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉందని, కాని సర్పంచ్‌ అవేవీ లేకుండానే ఒక వీధి రౌడీలా ప్రవర్తంచి దౌర్జన్యం చేశారని తెలిపారు. ఈ సంఘటనపై ఎ.కోడూరు ఎస్‌ఐకి, మండల తహశీల్దారుకు ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని, సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.