ఒంటి మిట్ట : మండలంలోని కుడ ములూరు వద్ద సోమశిల వెనుక జలాల పంపు హౌస్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు. ముందుగా ఆయన స్థానిక నాయకులతో కలిసి పూజలు నిర్వహించి పంప్ హౌస్ వద్ద బటన్ నొక్కారు అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంపు హౌస్ మరమ్మతు కోసం కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లామన్నారు. ఆయన చొరవ తీసుకొని ఒంటి మిట్ట పంపు హౌస్ రిపేరు కోసం రూ. 50 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. మరలా రెండో పైపు లైన్ రిపేర్ కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో మంజూరైన వెంటనే త్వరగా పనులు పూర్తి చే స్తామన్నారు. రబీని దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల వైసిపి ప్రజా ప్రతి నిధులు సర్పంచులు, అధ్యక్షులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.










