Nov 16,2023 22:53

కేంద్ర రక్షణ శాఖ సెక్రటరీతో మాట్లాడుతున్న మాగుంట


పజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌
ఒంగోలులో సైనిక్‌ స్కూలు, మాజీ సైనికులకు ఈసిహెచ్‌ఎస్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమనేను ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ సెక్రటరీ, శ్రీ గిరిధర్‌ అరమనేను ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపి మాగుంట మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారు రక్షణ శాఖలో సుమారు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. విశ్రాంత సైనికులు 13,000 మంది వారి కుటుంబ సభ్యులు ఎక్కువ మంది జిల్లాలో నివసిస్తున్నారన్నారు. ప్రస్తుతం గిద్దలూరులోని చిన్న వైద్యశాల వారి వైద్య సదుపాయాలను తీర్చలేకపోతుందన్నారు. ఇతర జిల్లాలలో ఏర్పాటు చేసిన విధంగా ప్రభుత్వ జాబితాలో చేర్చబడిన అన్ని సదుపాయాలు ఉన్న వైౖద్యశాలలు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈసిహెచ్‌ఎస్‌ వైద్యశాలను, ఒక సైనిక స్కూలును కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి లిఖిత పూర్వకంగా కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఈసిహెచ్‌ఎస్‌ వైద్యశాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, దీంతో పాటు సైనిక స్కూలు ఏర్పాటుకు కషి చేస్తానని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి హామీ ఇచ్చారు.