Dec 12,2021 10:53

కరోనా రెండో అలలో తగిలిన దెబ్బకు అందరం అతలాకుతలమయ్యాం. దాదాపు రెండేళ్లపాటు కరోనా పాండమిక్‌ కారణంగా అన్ని వ్యవస్థలూ అవస్థల్లో పడ్డాయి. ఇప్పడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి, అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్న తరుణంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (ఉఎఱషతీశీఅ) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌ అనే కరోనా కొత్త వేరియంట్‌ని నవంబర్‌ 24వ తేదీన దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఇది ఇప్పటివరకూ అతి ప్రమాదకారిగా గుర్తించబడిన డెల్టా వేరియంట్‌ కంటే ప్రమాదకరమనీ.. ఈ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొద్దిరోజుల్లోనే దరిదాపుగా 57 దేశాలకు ఇది పాకడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను గడగడలాడిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీన్నిబట్టి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ వేరియంట్‌ మనదేశంలోకీ అడుగుపెట్టేసింది. డిసెంబర్‌ 2వ తేదీ నాటికి అంటే వారం రోజుల లోపల మనదేశంలోనూ ఒమిక్రాన్‌ కేసులు రెండు నమోదయ్యాయి. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. ఈ నెల 10 తేదీ నాటికి మనదేశంలో 25 కేసులు నమోదు కావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ వేరియంట్లో వచ్చిన మార్పులేమిటి? ఇది ఎంత తీవ్రంగా ఉండబోతుంది? ఇది మూడో వేవ్‌కు దారితీస్తుందా? ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇవే మన ముందున్న ప్రశ్నలు. వీటిని నివృత్తి చేసేందుకే ఈ ప్రత్యేక కథనం..

                                                        మూడో అల ప్రారంభమైందా ?!

ఒమిక్రాన్‌.. మూడో అల ?

భారీగా కేసులు పెరిగి, తర్వాత తగ్గడాన్ని వేవ్‌ (అల) అంటాం. ఇప్పటికే మనం రెండు అలలను చవిచూశాం. మూడో అల వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేశాం. అంచనా వేసిన సమయానికి మూడో అల రాలేదు. చాలా సంతోషం. మూడో అల రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. భారీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరగడం మొదటి కారణమైతే. విస్తృతంగా సోకిన రెండో అల కారణంగా సమాజానికి వచ్చిన హెర్డ్‌ ఇమ్యూనిటీ రెండో కారణం. కొత్తగా కనుగొన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ యొక్క వ్యాప్తి తీవ్రత డెల్టా వేరియంట్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ మూడో అలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దేశంలో కరోనా మూడో అల అలముకుందనీ.. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ ప్రారంభదశలో ఉందనీ.. క్రమంగా ఇది విస్తరిస్తుందనీ.. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు.
     వచ్చే జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దీని తీవ్రత పతాకస్థాయికి చేరుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా ఇదే మాట చెప్పడంతో పాటే మూడో అలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనీ ప్రకటించింది. గత అలల అనుభవాలను ఉపయోగించుకొని ప్రభుత్వాలు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మూడో అలని నివారించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సిసిఎంబి మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా మాటల్లో చెప్పాలంటే 'ప్రజలందరికీ రెండు డోసులు వేయించగలిగి, తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే దరిదాపుగా మూడో అల వచ్చే అవకాశం లేదు'. ఇంకో రెండు మూడు వారాలు గడిస్తేగానీ.. ఈ విషయంపై ఒక స్పష్టత రాదు.

                                                        డెల్టా- ఒమిక్రాన్‌ మధ్య తేడా..

సాధారణంగా మనిషికి-వైరస్‌కి మధ్య జరిగే సంఘర్షణలో వైరస్‌లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. 2019లో కనుగొన్న కరోనా వైరస్‌లో అలా వచ్చిన మార్పులను బట్టి ఇప్పటికీ తొమ్మిది వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీటికి 'ఆల్ఫా, బీటా, గామా, డెల్టా' లాంటి పేర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టింది. ఇప్పుడు కొత్తగా కనుగొన్న ఈ వేరియంట్‌కు 'ఒమిక్రాన్‌' అనే పేరు పెట్టింది. డెల్టా వేరియంట్‌ కారణంగానే మనదేశంలో రెండో అల వచ్చింది. కరోనా వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మానవ కణజాలానికి అతుక్కోవడానికి ఉపయోగపడే కరోనా వైరస్‌లోని ఉపరితల భాగాన్ని స్పైక్‌ ప్రోటీన్‌ అంటారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్పైక్‌ ప్రోటీన్‌ను చైనా దేశంలోని ఊహన్‌ నగరంలో మొట్టమొదటిగా కనుగొన్న తొలి కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో దాదాపు 30 మార్పులు వచ్చాయి. డెల్టాలో ఇలాంటివి 10 మాత్రమే ఉన్నాయి. 30 మ్యుటేషన్‌లు జరిగిన తర్వాత గుర్తించినటువంటి వేరియంటే ఈ ఒమిక్రాన్‌.
     మ్యుటేషన్‌లలో మార్పు తప్ప ఈ రెండు వైరస్‌లూ ఒకటే. ఈ రెండు వేరియంట్లు కోవిడ్‌ కారకాలే. డెల్టా వేరియంట్‌ వల్ల కలిగే కోవిడ్‌ వ్యాధి లక్షణాలు కంటే ఒమిక్రాన్‌ వేరియంటు వల్ల కలిగే కోవిడ్‌ వ్యాధి లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటాయనీ.. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆరు రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వేరియంట్‌కి చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. కానీ దాని లక్షణాలు మాత్రం ఇబ్బందికరంగా లేవు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన ఒక్కరికి కూడా ఆక్సిజన్‌ సాయం అందించాల్సి అవసరం రాలేదట.

                                                    టీకా తీసుకోకపోతేనే ముప్పు!

   ఒమిక్రాన్‌ అయినా మరొకటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు ఉంటుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరక్టర్‌ డాక్టర్‌ వినరుకుమార్‌ నందకూరి స్పష్టం చేశారు. ముఖ్యంగా పెద్దల్లో ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందన్నారు. ఇప్పటికే కోవిడ్‌ బారిన పడి, రెండు టీకాలూ వేయించుకున్న వారికి దీని ప్రమాదం తక్కువని చెప్తున్నారు. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులూ తీసుకున్నవారికి రక్షణ ఎక్కువని వినయ్ కుమార్‌ వివరించారు.

                                                     బూస్టర్‌ డోసు ఉపయోగమా ?

   కోవిడ్‌ వ్యాధి వచ్చిన వారికి, వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత మానవ శరీరంలో ఏర్పడే ప్రతిరక్షకాల మోతాదు క్రమంగా తగ్గిపోతూ ఆరు నెలలకు మించి రక్షణ కల్పించలేవన్నది ప్రస్తుతం ఉన్న అవగాహన. బూస్టర్‌ డోస్‌ వేయించుకుంటే ప్రతిరక్షకాలు పెరుగుతాయన్నది శాస్త్రం చెబుతున్న విషయం. ప్రారంభంలో తయారుచేసిన వ్యాక్సిన్లు కొత్తగా వస్తున్న మ్యుటేషన్‌లపై ఎంత ప్రభావం చూపించగలుగుతాయన్నదీ పరిశోధన జరిగితే తప్ప, కచ్చితంగా చెప్పలేం. ఈ పరిశోధనలు జరగడానికి, ఫలితాలు వెల్లడి కావడానికి మరికొంత కాలం పడుతుంది. అప్పటివరకూ వేచి ఉండడం సాధ్యం కాదు అనుకుంటే నష్టమైతే ఉండదు. కాబట్టి బూస్టర్‌ డోసులు వేయించుకోవడం తప్పేమీ కాదు. ఆ రూపంలో బూస్టర్‌ డోస్‌ వేయించుకోవడం మంచిదే. అయితే ఇది ఎంతవరకూ సబబు అనేది పెద్ద ప్రశ్న. ప్రపంచంలో ప్రజలందరికీ మొదటి డోసు ఇవ్వలేని ఈ పరిస్థితుల్లో బూస్టర్‌ డోస్‌ వేసుకోవడం ఎంతవరకూ సబబు.
    అయితే ఈ సందర్భంలో ధనిక దేశాల్లో ప్రజలు బూస్టర్‌ డోసులు వేయించుకుంటున్నారు. పేద దేశాలకు కనీసం ఇప్పటివరకూ మొదటి రెండు డోసులూ అందుబాటులోకి రావడం లేదు. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే చాలా దేశాల్లో మొదటి డోసు కూడా పూర్తికాలేదు. కాబట్టి వీలైనంత త్వరగా మొదటి డోసు ప్రజలందరికీ వేయించాలి. తర్వాత రెండో మోతాదును అందించిన తర్వాతనే బూస్టర్‌ డోస్‌ వేయించుకోవడం సరైన పద్ధతి. బూస్టర్‌ డోసు పూర్తి రక్షణ కల్పించలేకపోవచ్చు, కానీ తప్పక రక్షణను పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కి బూస్టర్‌ డోసు వేయించడం ఎంతో అవసరం. అందుకే వీలైనంత త్వరగా ప్రజలందరికీ ప్రాథమికంగా రెండు డోసులు వేయడం పూర్తయిన వెంటనే బూస్టర్‌ డోసులు వేసే ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడం మంచిది.

                                                             పలు రాష్ట్రాల చర్యలు..

ఒమిక్రాన్‌ నేపథ్యంలో ప్రజలందరికీ రెండు డోసులు వేయించుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి.
బెంగళూరులో టీకా వేసుకుంటేనే మాల్స్‌లోకి, స్కూల్స్‌లోకి అనుమతిస్తున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వ్యాక్సినేషన్‌ రేటుని పెంచడానికి వినూత్నంగా ఆలోచించింది. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ వేయించుకుంటే స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీగా ఇస్తామంది.
కేరళ ప్రభుత్వం కోవిడ్‌ రెండు డోసులు చేయించుకోని వారికెవరికైనా కరోనా సోకితే వారికయ్యే ఖర్చును గవర్నమెంట్‌ భరించదని స్పష్టం చేసింది.
తెలంగాణలో టీకా వేయించుకోకపోతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

                                      మనదేశం గుర్తించిన 12 ఒమిక్రాన్‌ ప్రమాదకర దేశాలు

1. యునైటెడ్‌ కింగ్డమ్‌, 2. సౌత్‌ ఆఫ్రికా, 3. బ్రెజిల్‌, 4. బోట్స్‌ వానా, 5. చైనా, 6. జింబాబ్వే, 7. న్యూజిలాండ్‌, 8. హాంకాంగ్‌, 9. సింగపూర్‌, 10. ఇజ్రాయిల్‌, 11.మావ్రుతియస్‌, 12. టాంజానియా.
ఈ దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆర్‌టిపిసిఆర్‌ పరీక్ష చేసి. పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌లో పెట్టి, పరీక్ష నమూనాను జీనోమిక్‌ సీక్వెన్సెంగ్‌కి పంపుతున్నారు. అక్కడ ఏ వేరియంట్‌తో పాజిటివ్‌ వచ్చిందో కనుక్కుంటారు. దీనికి కనీసం మూడు రోజులు సమయం పడుతుంది. ఈ జీనోమిక్‌ సీక్వెన్స్‌ పరీక్షల రిపోర్టు త్వరగా వచ్చేందుకు పరీక్షా కేంద్రాలను మరిన్ని పెంచాల్సి వచ్చింది.

                                                     మనదేశంలో కేసుల వివరాలు..

దేశంలో మొదటి ఒమిక్రాన్‌ కేసు కర్ణాటకలో బయటపడింది. ఇతను 66 ఏళ్ల వృద్ధుడు. దక్షిణాఫ్రికా నుంచి నవంబర్‌ 20న బెంగళూరు వచ్చారు. అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ వ్యక్తి కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకున్నట్లు వైద్యులు గుర్తించారు.

                                                             రెండో ఒమిక్రాన్‌ కేసు

కర్ణాటకలోనే గుర్తించబడింది. ఇతని వయస్సు 46 ఏళ్లు. ఫిబ్రవరి నెల్లోనే ఇతడు కరోనా టీకా తీసుకున్నారు.

                                                                మూడో కేసు..

గుజరాత్‌లో నమోదైంది. ఇతనికి 72 ఏళ్లు. ఇతడు నవంబర్‌ 28న జింబాబ్వే నుంచి ముంబై మీదుగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చారు. డిసెంబర్‌ 2న ఇతడికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యక్తి చాలా ఏళ్లుగా జింబాబ్వేలో నివసిస్తున్నారు. బంధువులను కలిసేందుకు గుజరాత్‌ వచ్చారు.
 

                                                                 నాల్గో కేసు..

డిసెంబర్‌ 4వ తేదీన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ముంబై సమీపంలోని కల్యాణ్‌-డొంబీవలి ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఇతను మెరైన్‌ ఇంజనీర్‌. ఏప్రిల్‌ నుంచి అతడు షిప్‌లో ఉండటంతో షిప్‌ దక్షిణాఫ్రికా మీదుగా ప్రయాణించినట్లు తెలుస్తోంది.
 

                                                               ఐదో కేసు..

డిసెంబర్‌ 5న మనదేశంలో గుర్తించబడింది. ఇది దేశంలో 5వ కేసు, ఢిల్లీలో మొదటికేసు. టాంజానియా నుండి వచ్చింది.
ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఒమి క్రాన్‌ కేసుల సంఖ్య - రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్తాన్‌లో-9, మహారాష్ట్రలో-8, ఢిల్లీలో-1, కర్నాటకలో-2, గుజరాత్‌లో-1 నమోదయ్యాయి.

 

ఒమిక్రాన్‌.. మూడో అల ?



                                                                మాస్క్‌తో 53% రక్షణ

కరోనా నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ప్రతీ ముగ్గురిలో ఒకరు మాస్కు పెట్టుకోవడం లేదని తేలింది. మాస్కులు పెట్టుకోకుండానే బయటకు వెళ్తున్నారని సర్వే వివరాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. ఇప్పటికే మన దేశంలో ఒమిక్రాన్‌ ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండకుంటే, ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని వ్యాక్సిన్‌లు వేసుకున్నా, బూస్టర్‌ డోసులు తీసుకున్నా అవన్నీ తాత్కాలికమేనని, మాస్కు ఎల్లవేళలా ధరించడమే కోవిడ్‌పై బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని మహారాష్ట్ర కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు వసంత్‌ నగ్వేకర్‌ తెలిపారు. కరోనా వ్యాప్తిని మాస్కులు 53% నిరోధిస్తాయని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైందని తెలిపారు. రెండో వేవ్‌లో డెల్టా వేరియంట్‌ సోకిన తర్వాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అధిక జ్వరం, బలహీనత, ఆహారం రుచి, సువాసన తెలియకపోవడం వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే ఒమిక్రాన్‌ విషయంలో ఈ లక్షణాలు చాలా భిన్నంగా ఉన్నాయి.

                                                               వ్యాక్సిన్‌ల ప్రభావం..

ఒమిక్రాన్‌.. మూడో అల ?

కోవిడ్‌ నివారణకు ఇప్పటివరకూ వాడుతున్న రకరకాల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్‌ వేరియంటును జయించగలవా? లేదా? అన్నది ఇప్పుడు జరుగుతున్న పెద్ద చర్చ. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ఏ రకమైన వ్యాక్సిన్‌ కూడా నూరు శాతం కరోనాను నివారించగలిగే పరిస్థితి లేదు. దరిదాపుగా 85 శాతం మందికి ఈ వ్యాధి సోకకుండా నివారించగలుగుతున్నాయి. వ్యాధి సోకిన వారిలో దరిదాపుగా 85 శాతం మందిలో వ్యాధి తీవ్రత తగ్గించి, ఆసుపత్రి పాలు కాకుండా చూడగలుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చినా 85 శాతం మరణాలను జరగకుండా చూడగలుగుతున్నాయి. ఇదే రకమైన ఫలితం ఒమిక్రాన్‌ విషయంలోనూ ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడుతోంది. వ్యాక్సిన్‌ ప్రభావం ఎంత ఉంటుందన్నదీ స్పష్టంగా తెలియాలంటే ఇంకొంతకాలం సమయం పడుతుంది. ఇంతవరకూ ఉన్న శాస్త్రీయ సమాచారం ప్రకారం ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేయించుకుంటే ఒమిక్రాన్‌ వేరియంటునూ మనం జయించే అవకాశం ఉంది.

 

ఒమిక్రాన్‌.. మూడో అల ?



                                                         మూడు ప్రధాన లక్షణాలివే..

ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెప్పబడుతోంది. ఇప్పటివరకు గుర్తించిన రోగులందరిలో కరోనాలో కనిపించే సాధారణ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఫ్లూ లాంటి సమస్యలూ బయటపడలేదు. దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ ఓమిక్రాన్‌ మూడు ప్రధాన లక్షణాలు కలిగి ఉందని చెబుతున్నారు.
1. తలనొప్పి, 2. తీవ్రమైన అలసట, 3. ఒళ్లు నొప్పులు డెల్టా వేరియంటు లాగా ఒమిక్రాన్‌ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదు. అందుకే ఈ వేరియంట్‌ అంత ప్రమాదకారి కాదని అనిపిస్తునట్లు తెలిపారు. అయితే శాస్త్రీయంగా ఇంకా రుజువు కాలేదు. కాబట్టి అప్రమత్తంగా ఉండడమే రక్షణ చర్యగా భావించాలని చెబుతున్నారు.

                                             ఒమిక్రాన్‌ కేసులు నమోదైన దేశాలు

1. ఇండియా, 2. బోట్స్వానా, 3. దక్షిణాఫ్రికా, 4. నైజీరియా, 5. యునైటెడ్‌ కింగ్‌డమ్‌, 6. దక్షిణ కొరియ, 7. ఆస్ట్రేలియా, 8. చెక్‌ రిపబ్లిక్‌, 9. ఆస్ట్రియా, 10. బెల్జియం, 11. ఫ్రాన్స్‌, 12. జర్మనీ, 13. హాంకాంగ్‌, 14. ఇజ్రాయిల్‌, 15. ఇటలీ, 16. నెదర్లాండ్స్‌, 17. నార్వే, 18. స్పెయిన్‌, 19. పోర్చుగల్‌, 20. స్వీడన్‌, 21. కెనడా, 22. డెన్మార్క్‌, 23. బ్రెజిల్‌ దేశాల్లోనూ ఒమిక్రాన్‌ కేసులు విస్తరిస్తున్నాయి. అతి వేగంగా వ్యాపించడం ప్రపంచ ప్రజలను ఆందోళన పరుస్తున్నాయి.

                                                        జాగ్రత్తలు తప్పనిసరి..

కరోనాను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఏవైనా లక్షణాలు బయటపడితే వెంటనే పరీక్ష చేయించుకుని, నిర్ధారణ అయితే ఒంటరిగా ఉండాలి. ఈ విధంగా మాత్రమే ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
మాస్క్‌ను సరైన విధానంలో ధరించాలి.
సామాజిక దూరాన్ని పాటించాలి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఇప్పటివరకు రెండు డోస్‌ల టీకాలను తీసుకోకపోతే, వీలైనంత త్వరగా తీసుకోవాలి.

డాక్టర్‌ ఎం.వి రమణయ్య

డాక్టర్‌ ఎం.వి రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు
ప్రజారోగ్య వేదిక,
ఆంధ్రప్రదేశ్‌.
9490300431