ప్రజాశక్తి - ఆరిలోవ :కొలోస్టోమీ, ఇలియోస్టోమీ వంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న కేన్సర్, ఇతర రోగులకు ఎదురయ్యే మలమూత్ర విసర్జన సమస్యలకు ఉపయోగించే స్టోమాపై అవగాహనకు ఆరిలోవ హెల్త్‌సిటీ ఒమేగా ఆసుపత్రిలో ఒక ప్రత్యేక విభాగాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒమేగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిశకంర్‌తో కూడిన వైద్య బృందం విలేకర్లతో మాట్లాడుతూ, సాధారణంగా పెద్ద ప్రేగుకు కేన్సర్ వ్యాధి సోకిన వారికి ఒకొక్కసారి పెద్ద మలమూత్ర విసర్జన పేగును తొలగించాల్సి ఉంటుందన్నారు.. అటువంటప్పుడు ప్రత్యామ్నాయంగా స్టోమా బ్యాగులపై మలమూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందన్నారు.. స్టోమాపై సరైన అవగాహన లేక చాలమంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడిచారు.ఈ బ్యాగులపై అవగాహన, అపోహలు తొలగించేందుకు ఉత్తరాంధ్రలోనే తొలిసారిగా ఈ స్టోమా క్లినిక్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ బ్యాగుల నిర్వహణపై ఒమేగా ఆసుపత్రిలో వారానికి ఒక రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యశిబిరంలో రోగులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ శిబిరం నిర్వహణకు, స్టోమా బ్యాగులు, ఇతర పరికరాలు తయారుచేసే కోలోప్లాస్ట్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకున్నట్టు తెలిపారు. సమావేశంలో డాక్టర్ కె.విజరు, డాక్టర్ వి.కళ్యాణ్, కె.వి.సుబ్రహ్మణ్యన్, కోలోప్లాస్ మేనేజర్ డాక్టర్ రాషు పాల్గొన్నారు.










